Sunday, January 12, 2025

రచయిత సల్మాన్ రష్దీ కి జర్మనీ పురస్కారం

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ : వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ ప్రతిష్టాత్మక జర్మనీ పురస్కారం పీస్ ప్రైజ్ ఆఫ్‌ది జర్మనీ ట్రేడ్‌ను ప్రకటించారు. మిడ్‌నైట్ చిల్డ్రన్, సటానిక్ వర్సెస్ వంటి సంచలనాత్మక అంశాలతో నవలలు రాసిన ఈ బ్రిటిష్ ఇండియన్ రచయిత అలుపెరుగని, వెరపెరుగని , కృతనిశ్చయపు అంకితభావపు రచనా వ్యాసంగానికి గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు అందించాలని పురస్కార సంబంధిత జర్మనీ జ్యూరీ తెలిపింది. అక్టోబర్ 22వ తేదీన ఫ్రాంక్‌ఫర్ట్‌లో రష్దీకి ఈ పురస్కారం అందచేస్తారు. ఎప్పుడు పొంచి ఉన్న తీవ్రస్థాయి ముప్పు , అనేక దాడుల నడుమనే ఆయన సాగిస్తోన్న సహేతుక రచనాపట్టుకు ఇది తమ గుర్తింపు అని జ్యూరీ ప్రకటించింది. ఆయన రచనలు విశ్లేషణతో, స్థిరమైన సాహితీ సృజనాత్మకతతో, వ్యంగ్యం, హాస్యం , విజ్ఞత సంతరించుకుని ఉంటాయని తెలిపారు. హింసాత్మక ప్రవృత్తితో ఉండే అధికారిక వ్యవస్థలు యావత్తూ సమాజాన్ని దెబ్బతీస్తాయి.

అయితే వ్యక్తుల అంతర్గతమైన బలోపేతమైన ప్రతిఘటనా స్ఫూర్తిని ఏ శక్తి ధ్వంసం చేయలేదని ఈ రచయిత తన సృజనలతో స్పష్టం చేస్తున్నారని ప్రశంసించారు. గత ఆగస్టులో రష్దీ న్యూయార్క్‌లో ఓ సాహిత్యసభకు వెళ్లినప్పుడు ఆయన కత్తిపోట్లకు గురయ్యారు. 1988 నాటి ఆయన నవల ది సటానిక్ వర్సెస్ ఇస్లామ మత విశ్వాసాలను కించపర్చే విధంగా ఉందని దుమారం చెలరేగింది. ఈ క్రమంలో ఇరాన్ అధినేత అయాతుల్లా ఖమేనీ అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా మరణదండన ఫర్మానా వెలువరించారు. దీనితో ఈ రచయిత అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన తన నిర్భీతి రచనా ఫిరంగులను ధట్టిస్తూనే ఉన్నారు. వీటిన్నింటిని తాము పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఈ అవార్డు బహుకరిస్తున్నట్లు జ్యూరీ తెలిపింది. ఈ పురస్కారం పరిధిలో ఆయనకు ఫలకం, 25000 యూరోలు ( 27,350 డాలర్లు) అందుతాయి. ఈ అవార్డును 1950లో ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News