పలు ప్రాంతాల్లో వోల్టేజి సమస్య
కాలిపోతున్న విలువైన సామానులు
మనతెలంగాణ, హైదరాబాద్ : నగరం నలుదిశలా విస్తరిస్తూ విశ్వనగరంగా రూపు దిద్దుకుంటోంది. దానిలో భాగంగా కాలనీల, బస్తీలు విస్తరిస్తున్నాయి. వాటితో పాటు విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో సుమారు 60 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటికి తగిన విధంగా అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించే ప్రయత్నంలో భాగంగా డిస్కం అధికారులు పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్ల నిర్మాణాలు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ళకోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తొంది.
ఇంత జరుగుతున్నా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల ( హై వోల్టేజి, లో వోల్టేజి ) సమస్యలు పట్టి పీడదిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం. డిస్కం అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నా కింది స్థాయి సిబ్బంది మాత్రం వారి లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వోల్టోజీలో హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించాల్సిన సిబ్బంది ఆ దిశగా కృషి చేయకుండా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా
చాదర్‌ఘాట్ పరిధిలో హై వోల్జేటి విద్యుత్ సరఫరా జరగడంతో ప్రాంతానికి చెందిన కొంత మంది ఇళ్ళల్లో విలువైన పరికరాలు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీంతో చాదర్‌ఘాట్‌లోని మూసానగర్ వాసులు పెద్ద ఎత్తున శుక్రవారం విద్యత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్షం కారణంగా తాము ఎంతో నష్టపోయాని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు అధికారులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపచేశారు.
విచారణ జరిపిస్తాం.. బాధితులకు న్యాయం చేస్తాం : విద్యుత్ అధికారులు
సంఘటన పూర్వాపరాలకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు అధికారులు చెబుతున్నారు .క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దర్యాప్తు నివేదిక అనంతరం బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.