Sunday, December 22, 2024

సిద్దరామయ్య సర్కార్‌కు కొత్త తలనొప్పి: తెరపైకి మళ్లీ ముస్లిం వ్యాపారుల వివాదం

- Advertisement -
- Advertisement -

దక్షిణ కన్నడ: దేవాలయాల ప్రాంగణాలలో ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధానికి సంబంధించిన జఠిలమైన సమస్య మళ్లీ కర్నాటకలో తెరపైకి వచ్చింది.

హిందూ ఆలయాల ప్రాంగణాలలో ముస్లిం వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి అనుమతించాలని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల మతపరమైన ఉత్సవ వ్యాపారుల సమన్వయ కమిటీ డిమాండు చేస్తుండగా మతపరంగా సున్నితంగా ఉండే కోస్తా జిల్లాల్లోని ఆలయ పాలనా యంత్రాంగాలు మాత్రం ముస్లిం వ్యాపారులపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.
దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నగరంలోగల చారిత్రాత్మక మంగళా దేవి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాలలో ముస్లిం వ్యాపారులపై నిషేధాన్ని విధించడంపై వ్యాపారుల సమన్వయ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ఒక ఫిర్యాదును అందచేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముజరై శాఖ(దేవాదాయ) పరిధిలోకి వచ్చే మంగళాదేవి ఆలయంలో వనరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు జరగనున్నాయి.ఉత్సవాలలో ముస్లిం వ్యాపారులు పాల్గొనడాన్ని అనుమతించకూడదని ఆలయ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న రాతబీడి వీధిలో వ్యాపారులకు స్టాళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ప్రారంభించారు. మంగళూరు నగరకార్పొరేషన్‌కు చెందిన ఈ వీధిలో స్టాళ్ల ఏర్పాటును ఆలయ నిర్వాహకులే ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నారు.

కళాశాల తరగతి గదుల్లోకి ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో దీనిపై ముస్లిం సంఘాలు నిరసనలు తెలియచేసిన దరిమిలా హిందూ ఆలయాలలో ముస్లిం వ్యాపారులను బహిష్కరిస్తున్నట్లు హిందూ సంఘాలు గతంలో ప్రకటించాయి.అప్పట్లో బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉంది. ముస్లిం వ్యాపారులు ఆలయ ప్రాంగణాలలో వ్యాపారాలు చేసుకోవడాన్ని నిషేధిస్తూ ఆలయ నిర్వహణా కమిటీలు తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ప్రభుత్వం కూడా అప్పట్లో సమర్థించింది.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం రావడంతో మళ్లీ ఈ సమస్య తెరపైకి వచ్చింది. ముస్లిం వ్యాపారులపై నిషేధం విధించడాన్ని ప్రశ్నిస్తూ వయాపారుల సమన్వయ కమిటీ గురువారం దక్షిణ కన్నడ జిల్లా కమిషనర్‌కు ఒక వినతిపత్రాన్ని అందచేసింది. ఈ సమస్యను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి చాడాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News