Monday, December 23, 2024

‘ఆటిజం’ ఉన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఆటిజం అనే వ్యాధి ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. జన్యుపరమైన, లేదా నాడీ సంబంధమైన, లేదా గర్భిణులు తీసుకునే ఆహార ఫలితమైనా కావచ్చు. పిల్లల్లో ఇప్పుడు ఈ వ్యాధి ప్రబలు తోంది. అధ్యయనాల ప్రకారం మనదేశంలో 18 మిలియన్ మంది ఆటిజంతో బాధపడుతున్నారు. దీనిపై సరైన అవగాహన లేక సకాలంలో వైద్యం అందించక పోవడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లల్లో 125 మందిలో ఒకరికి, 6 9 ఏళ్ల వయసువారిలో 80 మందిలో ఒకరికి ఇది సంక్రమించినట్టు తెలుస్తోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తుండాలి. అందరు పిల్లలూ ఒకేలా ఉండరు.

కొందరు చురుకుగా ఉంటారు. మరికొందరు స్తబ్ధులుగా ఉంటారు. మనం వారి వైపు చూసినా వారు పట్టనట్టే ఉంటారు. మనవైపు చూడరు. మనం నవ్వినా వారు నవ్వరు. మనం పిలిస్తే పలకరు. మనం చెవుడేమో అనుకుంటాం. కానీ అది కాదు. మనం ఏపని చేసినా స్పందించని పిల్లలుంటారు. వీరు ఇతరులతో కలియకుండా ఒంటరిగా ఉంటారు. నేరుగా కళ్లలోకి చూడలేరు. మనల్ని చూస్తూ మాట్లాడలేరు. తమకు ఏం కావాలో చెప్పలేరు. చేసిన పనుల్నే మళ్లీ చేస్తుంటారు. ఎక్కువగా ఏడుస్తుండటం, అడిగింది ఇవ్వక పోతే ఇంకా మారం చేయడం, ఏదైనా వస్తువుపై ప్రేమ పెంచుకుని దాని తోనే కాలం గడపడం చేస్తుంటారు. వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోలేరు. దెబ్బలు తగిలినా చలించరు. శబ్దాలు పట్టించుకోరు. ఇలాంటి లక్షణాలు ఆటిజం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వెంటనే వైద్యులకు చూపించాలి.

ఈ వ్యాధి లక్షణాలు ఏడాది లోపు నుంచే కనిపించినా నాలుగేళ్ల వరకు మనం గుర్తించలేం. ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్‌డి) అని పిలిచే ఈ వ్యాధి నాడీ సంబంధిత పరిస్థితి. అలాగే శిశువు నెలలు నిండక ముందే పుడితే ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సకాలంలో దీన్ని గుర్తిస్తే వ్యాధి లక్షణాలను చాలావరకు తగ్గించవచ్చు. పిల్లలు సాధారణ జీవితం గడిపేలా చేయవచ్చు. ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువగా గడుపుతుండాలి. వారితో తరచుగా మాట్లాడుతుండాలి. ఆటిజం పెద్దల్లో కూడా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది చిన్నచిన్న విషయాలకే కలత చెందుతుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. మాట్లాడేటప్పుడు చాలాసార్లు గందరగోళంలో పడుతుంటారు. మరిపెద్దలకు కూడా ఈ వ్యాధికి చికిత్సలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News