హైదరాబాద్ : చిట్టీ డబ్బులు కట్టలేదని ఆటోను తీసుకుని వెళ్లిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లోని దుర్గాభవానీ నగర్ బస్తీలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. ఓ వ్యక్తి వద్ద చిట్టీ కడుతున్నాడు. కొంత కాలం నుంచి చిట్టీ డబ్బులు కట్టకపోవడంతో అతడి ఏజెంట్ వచ్చి ఆటోను తీసుకుని వెళ్లాడు. దీంతో మనస్థాపం చెందిన ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిట్టీల వ్యాపారి వెంటనే ఆటోడ్రైవర్ మృతదేహాన్ని హడావిడిగా సొంతూరికి పంపించాడు. అంత్యక్రియల అనంతరం బంధువులు మృతుడి ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను పరిశీలించగా చిట్టీల వ్యాపారి బెదిరింపులు బయటికి వచ్చాయి. దీంతో బాధితుడి బంధువులు మహబూబ్‌నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.