సిటిబ్యూరోః మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమకు కిరాయిలు రావడంలేదని ఓ డ్రైవర్ ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ప్రజాభవన్ ఎదుట గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ దేవా నగరంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు కిరాయిలు రావడంలేదు. దీంతో గతకొంత కాలం నుంచి వారు ఆందోళన చేయడంతోపాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ దేవా ఆటోలో ప్రజాభవన్ వద్దకు అక్కడ గేటు వద్ద నిలిపాడు, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆటోపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆటో కాలిపోయింది, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నించారు. ఆటోకు నిప్పుపెట్టుకున్న దేవాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కిరాయి రాకపోవడంతో లేక ఆదాయం లేకపోడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పాడు. ఆటోడ్రైవర్ మద్యం మత్తులో ఆటోకు నిప్పుపెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.