కేంద్రాలను పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కూడా సజావుగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆటో, మోటార్, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రవాణా శాఖ అందిస్తున్న వ్యాక్సినేషన్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. టీకాను తీసుకోవడానికి వస్తోన్న అర్హులైన డ్రైవర్లందరికీ సిబ్బంది తగిన కోవిడ్ నిబంధనల సూచనలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ మూడో రోజు కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగింది. ప్రతి రోజు ఆయా సెంటర్లను పర్యవేక్షిస్తున్న రవాణాశాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు శనివారం బహదూర్‌పుర మల్లేపల్లిలోని వ్యాక్సినేషన్ కేంద్రాలకు ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించారు.
డ్రైవర్లు సురక్షితంగా ఉన్నప్పుడు ప్రయాణీకులు, వారి కుటుంబసభ్యులు కరోనా బారి నుంచి కొంత రక్షించుకోగలుగుతారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డ్రైవర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తే వ్యాక్సినేషన్ సులభం అవుతుందని, అయినప్పటికీ కొందరు డ్రైవర్లకు సాంకేతికత అవగాహన లేనప్పటికీ సిబ్బంది సహకారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వారికి కూడా టీకా అందించడం జరుగుతోందని తెలిపారు. కేంద్రాలకు వచ్చే డ్రైవర్లు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనల్ని పాటించి యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. టీకా తీసుకున్న డ్రైవర్లు తోటి వ్యాక్సినేషన్ గురించి చెప్పి వారిని టీకా తీసుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు.