Friday, November 22, 2024

ఆటో డ్రైవర్ల గోడు ఆలకించండి

- Advertisement -
- Advertisement -

ఉచిత బస్సు ప్రయాణ పథకం మూడు ఉన్నాయి. అందులో మొదటగా ‘ఉచిత బస్సు ప్రయాణ పథకం’ని ఈ నెల 9న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఈ పథకం ద్వారా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరూ తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకాన్ని 7,290 బస్సులకు వర్తింపజేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మెట్రో రైళ్లు, ఆటోలు ఎక్కేవారు బాగా తగ్గిపోయారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రతిరోజూ టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీ కార్తీక సోమవారం కావడంతో రికార్డు స్థాయిలో 50 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ మునిశేఖర్ చెప్పారు. ఈ పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య ఏడాదికి 40 శాతం నుంచి 55 శాతానికి పెరుగుతుందని అంచనా.

మహిళలందరూ బస్సులు ఎక్కడం వల్ల ఆటోలు ఎక్కే మహిళలు లేరు.రాష్ట్రం అంతటా ఇదే సమస్య. ఈ పథకం వల్ల తాము ఉపాధి పోయి వీధినపడుతున్నామని ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. మహిళలందరూ ఆర్టీసీ బస్సులు ఎక్కితే, ఎన్నో ఏళ్లుగా ఆటోలనే నమ్ముకున్న తాము బతికేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉంటారని ఒక అంచనా. తమ ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులకు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు విద్యార్థుల బలిదానాలు జరిగాయని, ఇప్పుడు ఆటోడ్రైవర్ల బలిదానాలు జరగాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించారు. మహాలక్ష్మి పథకంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే డ్రైవర్లపై ఉన్న అన్ని రకాల ట్యాక్స్ లను రద్దుచేసి, తమకు ప్రతి నెలా రూ.20వేలు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఆటో రిక్షా కోసం రోజుకు రూ.400 అద్దె చెల్లించాలని, డీజీల్/పెట్రోల్ కోసం మరో రూ.400 ఖర్చు చేస్తున్నామని, ఇప్పుడు తమ సంపాదన పడిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకం వల్ల ఎన్నడూ లేని మరో సమస్య వచ్చి పడింది. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని పురుషులు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు.
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, తమను అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం, కో-కన్వీనర్లు వి.కిరణ్, బి.శ్రీకాంత్ తదితరులు డిమాండ్ చేశారు.కర్నాటకలో మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యపై ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. “ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది వారి గురించి ఏదైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి” అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆటోడ్రైవర్ల సమస్యను పరిశీలించి, వారిని ఆదుకొనవలసిన అవసరం ఉంది.

శిరందాసు నాగార్జున
9440222914

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News