Monday, December 23, 2024

నగరంలో ఆటో ముఠాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నగరంలో ఆటో ముఠాల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి ఒంటరిగా వస్తున్న ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకుని ఆటో ముఠాలు దోపిడీలు చేస్తున్నాయి. బాధితుల నుంచి అందినకాడికి దోచుకుని పరారవుతున్నారు, ప్రయాణికులను నిర్ధాక్షిణ్యంగా నిర్మానుష్య ప్రాంతంలో దించివేసి పరారవుతున్నారు. బాధితులను వారు చేరాల్సిన ప్రాంతానికి కాకుండా నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకుని వెళ్లి దాడి చేసి డబ్బులు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు తీసుకుని ఒదిలేసి పోతున్నారు. ఈ మధ్యలో ఇలాంటి ముఠాల నేరాలు పెరుగుతున్నాయి. పలువురు నిందితులు వ్యసనాలకు బానిసలుగా మారి దోపిడీలు చేస్తున్నారు. యువకులు అద్దెకు ఆటోలను తీసుకుంటున్నారు, ఒకరు ఆటోను డ్రైవింగ్ చేస్తుండగా మిగతా ఇద్దరు ప్రయాణికుల వలే వెనుక సీట్లలో కూర్చుంటున్నారు. రాత్రి సమయంలో వచ్చిన ప్రయాణికులు తాము వెళ్లాల్సిన ప్రాంతం చెప్పగా వెళ్తామని బయలు దేరుతున్నారు.

మార్గమధ్యలోకి వెళ్లగానే బాధితులు వెళ్లే ప్రాంతానికి కాకుండా నిర్మాణుష్య ప్రాంతాలనికి తీసుకుని దాడి చేస్తున్నారు. బాధితులను భయభ్రాతులకు గురిచేసి వారి వద్ద ఉన్న అన్ని వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోతున్నారు. ఇటీవలే నల్గొండకు చెందిన యువకుడు తన తల్లికి మెడిసిన్ తెచ్చేందుకు వెళ్లాడు. ఎల్‌బి నగర్ నుంచి వచ్చి మెహిదీపట్నంలోని ఆటో స్టాండ్ వద్దకు వచ్చి ఓయూ కాలనీలోని తన బాబాయి ఇంటికి వెళ్లాలని చెప్పాడు. వెనుక సీట్‌లో ఇద్దరు యువకులు కూర్చోవడంతో ప్రయాణికులు కావచ్చని ఆటో ఎక్కాడు. కొద్ది దూరం పోయాక నానాల్‌నగర్ వద్ద ఆటోను లంగర్ హౌస్ వైపుకు తిప్పారు. వెంటనే తాను వెళ్లాల్సింది ఇటు కాదని వారితో అనడంతో కత్తిని గొంతు వద్ద పెట్టి అరిస్తే చంపివేస్తామని బెదిరించారు. సన్‌సిటీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి డబ్బులు, మొబైల్ ఫోన్ తీసుకుని దాడి చేసి అక్కడే వదిలేసి పారిపోయారు.

బాధితుడు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా కొన్ని ఆటో ముఠాలు ఇలాగే ఒంటరిగా ప్రయాణం చేసే వారిని కొద్ది దూరం తీసుకుని వెళ్లిన తర్వాత బెదిరించి దోచుకున్నారు. నాంపల్లిలోని ఓ ముఠా కూడా ఇలాగే ఒంటరి వచ్చే వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకున్నారు. ఈ ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి నేరాలు చేస్తున్న వారిలో ఎక్కువగా పాత నేరస్థులు ఉంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు నగరానికి వచ్చిన వ్యక్తి దోచుకున్నారు. గోవా రాష్ట్రం, మోర్‌జిమ్ ప్రాంతానికి చెందిన సబిద్‌సిల్లా సోదరుడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవమని మెయిల్ వచ్చింది. దీంతో తెలంగాణ సిఎంను కలిసేందుకు సబిద్ సిల్వా ఈ నెల 8వ తేదీన రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వచ్చాడు.

సాయంత్ర 7 గంటల వరకు చూసినా కూడా కలిసేందుకు వీలుకాకపోవడంతో 7.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్ నంబర్ 45లో ఆటో ఎక్కాడు. ఆటోవాలకు తన వద్ద యూరోలు ఉన్నాయని, వాటిని మార్చి డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆటోవాలా తన స్నేహితులకు ఫోన్ చేశాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. రాత్రి 11 గంటల సమయంలో యూసుఫ్‌గూడ జనకమ్మ తోట ప్రాంతానికి చేరుకున్నాక ముగ్గురు కలిసి సబిద్‌సిల్వాను కొట్టి డబ్బులు బలవంతంగా గుంజుకున్నారు. వారిపై తిరగబడిన సబిద్‌సిల్వా కుడి చేతిమీ, కుడికాలు మీద పదునైన వస్తువుతో దాడిచేయడంతో గాయాలయ్యాయి. దీంతో బాధితుడు మదురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాతనేరస్థులపై నిఘా పెట్టే పోలీసులు వీరి విషయంలో ఎలా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

వ్యసనాలకు బానిసలు….
ఆటోలో ఒంటరిగా ప్రయాణించే వారిని టార్గెట్‌గా చేసుకుని దాడి చేసి దోచుకుంటున్న వారిలో యువకులు ఎక్కువగా ఉంటున్నారు. చిన్న వయస్సులోనే వ్యసనాలకు బానిసలుగామారి వాటికి డబ్బులు లేకపోవడంతో నేరాలు చేస్తున్నారు. ఇందులో చాలామంది గతంలో ఇలాంటి నేరాలు చేసి అరెస్టు కాబడినవారే ఎక్కువగా ఉన్నారు. చదువు కూడా లేకపోవడం ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆటోను అద్దెకు తీసుకుని నగరంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున వరకు ఆటోను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వస్తున్న వారిని దోచుకుంటున్నారు. వారు చెప్పినట్లు ఇవ్వకుండా నిరాకరించినవారిపై దాడి చేసి బాధితుల వద్ద ఉన్న డబ్బులు తీసుకుని మద్యం, గంజాయి కొనుగోలు చేసి తాగుతున్నారు.

దృష్టి సారించని పోలీసులు….
నగరంలో ఆటోలు నడిపినట్లు చేస్తూ అమాయకులను దోచుకుంటున్న ముఠాలపై పోలీసులు నిఘా పెట్టడంలేదు. దీంతో వారు తరచుగా అమాయకులపై దాడి చేసి దోచుకుంటున్నారు. వరుసగా సంఘటనలు జరుగుతున్నా అర్ధరాత్రి పెట్రోలింగ్ టీములను అప్రమత్తం చేయడంలేదు. నగరంలో ప్రజల రక్షణకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని చెబుతున్నా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల వైఫల్యం కన్పిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, ఆటో వివరాలను తెలుసుకునేందుకు మై ఆటో హీజ్ సేఫ్ కార్యక్రమం చేపట్టినా నగరంలోని అన్ని ఆటోలు ఇందులో చేరలేదు. కరోనా రావడంలో ఈ కార్యక్రమం మర్చిపోయారు. దీంతో నగరంలో అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణం చేసే వారికి భద్రత లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నగరంలో తిరుగుతున్న ఆటోలపై నిఘా పెట్టి నేరాలు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News