రామసింహకవి ఆత్మకథ ముద్రణ వల్ల తెలంగాణ నేలపై నడయాడిన ఓ అద్భుత పద్యకవి చరిత వెలుగులోకి వచ్చింది. రామసింహకవి తన ఆత్మ కథ రాయకున్నా, రాసి ఉండి కూడా అది పుస్తకంగా రాకున్నా తెలుగు సాహిత్యం ఒక సమర్థ కవీంద్రుని సమాచారం కోల్పోయి ఉండేది. ఈ ఆత్మకథ రాక వెనుక వేముల ప్రభాకర్ అవిరళ కృషి ఉంది.
రామసింహకవి పూర్వీకులను ఐదవ నిజాం శాంతిభద్రతలు, శిస్తు వసూలు కోసం పంజాబ్ నుంచి హైదరాబాద్ కు రప్పించారట. అలా తాతలనాడే వలస వచ్చిన కుటుంబం జగిత్యాల సమీపంలోని రాఘవపట్నంలో స్థిరపడింది. అక్కడే రామ సింహ 1857 లో జన్మించారు. ఊర్లో ఎడ్ల కాపరుల మధ్య మొదలైన వివాదం రామసింహ జీవితంలో తీరని వేదనని మిగిల్చింది. ఆయుధం చేబూని పైకి వచ్చిన తోటి గ్రామస్తుడితో జరిగిన పోరులో రామసింహ స్వీయరక్షణార్థం ఖడ్గాన్ని ఆయనవైపు తిప్పడంతో ఆ వేటుకు ప్రత్యర్థి ప్రాణాలు విడిచాడు. దీంతో రామసింహకవిని కోర్టు హంతకుడిగా నిర్ధారించింది. అలా రామసింహకవి 14 ఏళ్ళు జైలు జీవితం అనుభవించారు. ఆయన పేర్కొన్న ప్రకారం ఆయన జైలు జీవితం 1895 నుండి 1909 దాకా కొనసాగిందని తెలుస్తోంది.
ఆ తర్వాత సొంత ఊరిలో వ్యవసాయం చేస్తూ నిరంతరంగా కృతుల రచన కొనసాగించారు. ఆయన రాసిన కృతులను విని సంతోషించి పోషకులు కవిని సాదరముగా గౌరవించడమే గాక ధన సహాయం కూడా చేసేవారు. పలు గ్రామాలు తిరుగుతూ పెత్తందార్లు, దొరల దగ్గరకు వెళ్లి తన కృతులను వినిపిస్తూ రామసింహకవి సత్కారాలతో పాటు ’రౌప్యములు’ అందుకొనేవారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఆయన విస్తారంగా గ్రామ సందర్శనలు చేశారు. రామసింహకవి ఆత్మకథలో ఆయా పర్యాటక విశేషాల ప్రస్తావన ద్వారా ఆ రోజుల్లో ఉన్న రవాణా వ్యవస్థ, పాత గ్రామాలు పేర్లు, మనుషుల ప్రవర్తన, బాంధవ్యాలు మనకు తెలుస్తాయి. మరి ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ జిల్లాల్లోని గ్రామాల్లో సార్వభౌమాధికారాలు చెలాయించిన రెడ్డి, వెలమ దొరలు కవుల పట్ల, పద్య సాహిత్యం పట్ల ఎంత ఔదార్యంగా వ్యవహరించారన్న విషయం అబ్బురపరుస్తుంది. తనను రౌప్యములతో, రుచికర భోజన వసతులతో ఆయా గ్రామ పెద్దలు సత్కరించిన తీరును కవి ఎంతో మర్యాదగా వివరించారు. ఆ ప్రాంతాలకు చెందిన నేటి తరానికి ఆయా గ్రామ దొరలపేర్లు తెలుసు కానీ వారి సాహిత్యాభిలాష మాత్రం ఈ ఆత్మకథ ద్వారానే తెలియవచ్చిందనవచ్చు. రామసింహకవి వాక్యాల్లో వీరి ప్రస్తావన ఇలా ఉంది. ’రాక్షస నామ సంవత్సరమున మహారాజాశ్రీ తాండ్ర మీనారావు వెలమ దొరవారి అభిమతంబున రత్నకళా విజయము కృతి జెప్పి నూటపదహార్లు బహుమతి వడసితి. అదే సంవత్సరము కొదురుపాక ధర్మారావు దొరవారి అభీష్టమున పద్మినీ ప్రభావము కృతి జెప్పి నూటపదహార్లు బహుమతి వడసితి. అది నందన నామాబ్దము. మోర్తాడు సంస్థానాధిపతి మహారాజశ్రీ రామేశ్వరరెడ్డి దొరవారు సగౌరవంగా బిలిపించి కృతులంది నూటపదహార్లు బహుమతియును, నవీన వస్త్రాలంకారములతో సంతృప్తునిగా జేసి సువర్ణాంగుళీయకమొసంగిరి. వెలగటూరు దేశముఖ్ మహారాజశ్రీ లింగాల రామగోపాలరావు దొరవారు కచ్చరమంపి రప్పించుకొనిరి. వారును బానుజా పరిణయమను భాగవతం జెప్పించి నూటపదహారు రౌప్యములు బహుమతితో తులమెత్తు బంగారు ఉంగరం, నవీన వస్త్రాలంకృతునిగా జేసి వ్రేలుకు దొడిగించిరి. ఆ దొరవారు జీవితులైయున్నంత వరకు ప్రతి సంవత్సరము పది రౌప్యములు సన్మానముగా దయచేయుచుండిరి.’ ఇలా కవిని తమ ఇంట సత్కరించి ధనసహాయం చేసిన ’మహారాజాశ్రీ’ల ఊర్లు, పేర్లు నలభై దాకా ఈ ఆత్మకథలో తారసిల్లుతాయి.
ఆ రోజుల్లో పండితుల మధ్య సమస్యాపూరణ పరీక్షలు మెండుగా జరిగేవి. అలా ఎదుటి వారిచ్చిన సమస్యల పూరణల్లో వెనుకడుగు ఎరగని రామసింహకవి మిగితా పండితులను తమ సమస్యా ప్రశ్నలతో చిక్కుల్లో పెట్టేవారు. ఒకసారి అనంతగిరి దొర వెంకటరావుతన వద్ద ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న ‘కవినై పుట్టుటకంటె కీడు గలదె క్ష్మాపాల లోకంబునన్‘ అనే సమస్యను రామసింహపై సంధించారు. ’లోకములో మానవుడు నిరక్షర కుక్షియౌట కీడుగాని పాండిత్యము గలిగి కవియవుట కీడెట్లౌను’ అని తలచి ’అవనీశుల్ ధనికుల్ దయాన్వితులు విద్యాపారగుల్ ధార్మికుల్ ధరనెందులేక కవినై పుట్టుటకంటె కీడు గలదె క్ష్మాపాల లోకంబునన్’ అని పూరించగా సంతసించిన దొరవారు తాను ధరించిన చంద్రహారమును రామసింహకవి మెడలో వేసి గాఢాలింగనం చేసుకొన్నారు.
రామసింహ కవి నికరమైన హేతువాది. ఆ రోజుల్లోనే గుడి నిర్మాణము కన్న చెరువులు తవ్వించుట పుణ్యకార్యమని బాహాటంగా చెప్పేవారు. ’నిర్జీవ జడములకంటె దేవునకు జీవస్థానములే శ్రేష్ఠ స్థానములు గనుక నిరర్థకమైన గుళ్లు గట్టుట కంటె చెర్లు గట్టుట దేశసేవ’ అని నిర్భయంగా రాశారు. మరో సందర్భంలో- ప్రాణములేని శిలలు పూజించక పాట్లబడేదెవరూ / ప్రాణములు గల పత్రిపుష్పమును పాడుజేసెదవు మూఢా’, ’రామసింహమా ఎంత మ్రొక్కినను రాళ్లు దేవతలు గావూ / నీమాత్రము శక్తి లేదు వాటికీ నిన్నవిదెలియగ లేవూ’ అని పాలు చోట్ల తన హేతువాద దృక్పథాన్ని తెలుపుకున్నారు. రామాయణంలో రాముని, మహాభారతంలో కృష్ణుని వ్యక్తిత్వాలకు భంగం కలిగేలా కథా చిత్రణ ఉందని రామసింహకవి వాదన. వాటిని సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆయన యథార్థ రామాయణం, యథార్థ మహా భారతం పేరుతో రచనలు చేశారు. ‘శ్రీరామచంద్రావతారాధికారమున్ – వ్యర్థంబుగాజేసి వ్రాసినారు / శ్రీమహాలక్ష్మియౌ సీతాభిరాట్టిని వికృతాత్మురాలు గావించారు / బ్రహ్మచర్యవ్రతపాటవంబునకు – కళంకంబు బెట్టిరి లక్ష్మణునకు / ఇంతింతవారినే హీనాత్ములుగవ్రాసి – వీటినే గొప్పభావించినారు’ అంటూ రామాయణంలోని మూడు ప్రధాన పాత్రలను తనదైన రీతిలో సరిదిద్ది ’యథార్థ’ రచనలు చేశారు. ‘రాముని మోహించిన శూర్పణఖ ముక్కు చెవులు కోయించుట పురుషాధర్మమా! బ్రహ్మచర్య దీక్షలో ఉన్న లక్ష్మణుడు పరస్త్రీని ముట్టుకొని పడవేసి కర్ణనాసికాచ్చేదనం గావించుట సత్యసిద్ధాంతమా! భయనయములతో వెళ్లగొట్టక వలచివచ్చిన దాని ముక్కు చెవులు గోయుట ఇదేమి ధర్మమని శ్రీసీతామహాదేవి నివారింపకుండునా! కావున తత్‌క్షల కర్మము సర్వమబద్దము.
లోకమునందెవరైన నడగవలసిన జాడ మానవులు మానవుల నడుగుదురుగాని మృగ ఖగనగ పశు పాషాణముల నడుగరు. శ్రీరామచంద్రుడు మందమతియా? రామాయణములలో గల ఈ అయోగ్యములను అనృతములను అనర్థములను నిర్మూలింపజేసి యథార్థ రామాయణమును కృతించి మూడు వేళ గ్రంథములను ముద్రించితిని. అటులే మహాభారతమునందు గల రంకుబొంకులను జంకు లేకుండా తొలగించి వచన కావ్యమును కృతించితిని.’అని ఈ సొంత కథలో రాసినారు. అయితే యథార్థ మహాభారతము,యథార్థ దశమస్కంధము మొదలగు రచనల ముద్రణకు ఆర్థికసహాయార్థం రామసింహకవి ఆ ముదిమి వయసులో చాలా ఊర్లు తిరగవలసి వచ్చింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడుగా తన మనమడు గోపాల్ సింగ్ వచ్చారని ఇందులో పేర్కొన్నారు. కాలమార్పుతో గ్రంథముద్రణకు పూర్వరీతిలో సహాయం లభించకుండెను. ఇచ్చిన అయిదు, పది రూపాయలు కూడా స్వీకరించక తప్పలేదు. ’ధనమున్నను ధర్మ గుణములేని వారలందరు ధనముపై కావలుండిన క్రూరసర్పములే యనుటకేమభ్యంతరము. ఇంతైతే ప్రయాసమే అధికము, ఫలము స్వల్పము’ అని పేర్కొన్నారు. అలా ఎంతో ఆశగా చాలా ఊర్లు తిరిగి జమ చేసిన ధనముతో కరీంనగర్ ప్రెస్ లో యథార్థ మహాభారతము, ఆ తర్వాత సికిందరాబాదులోని కొండా శంకరయ్య శ్రేష్టి ప్రెస్ లో యథార్థ దశమస్కంధము ముద్రించగలిగారు.
ఈ ఆత్మకథను కవి తన తొంబది తొమ్మిదవ ఏట ఆరంభించినట్లు పుస్తకంలో ప్రస్తావన ఉంది. ఆ సమయంలో కూడా పద్య రచన, ముద్రణాప్రయాస కొనసాగినట్లు తెలుస్తోంది. భజన మాలాగ్రంథం ముద్రించుటకు చందా ధనం చాలక,సంచారం సాగక అశక్తుడనై వృధా కాలము గడిచెను అని రాశారు. ఆత్మకథ చివరి పేజీలో ’నేనిపుడు ప్రవృద్ధాంధుడను. పంగుండను. నా వయసు 104 పైషణ్మాసములు. మేధాబలము శిథిలమైనవాడను. తప్పులు దోచినను క్షమా వేడెద’ అని ముగించారు. తన జీవనం, రచనల విశేషాలను, ఆనాటి సాహితీ పోషకుల గుణగణాలను ఇందులో ఉన్నదున్నట్లుగా రాసిన రామసింహకవి 1963 లో తనువు చాలించారు. దాని వ్రాతప్రతిని కవి మునిమనవడు గురుదేవ్ సింగ్ ఇంతకాలం భద్రంగా దాచి ఉంచారు. రామసింహకవి ప్రాశస్త్యం తెలిసిన వేముల ప్రభాకర్ రాఘవపట్నం వెళ్లి గ్రామస్తులతో చర్చించి చివరకు హైదరాబాద్ లో ఉంటున్న గురుదేవ్ సింగ్ ను కలిసి ఆత్మకథ వ్రాతప్రతిని సంపాదించారు. జీర్ణావస్థలో ఉన్న రాతప్రతులు చదివి, చెల్లాచెదరైన 22 ఆశ్వాసాలను క్రమపద్ధతిలోకి తెచ్చి, గ్రాంథిక తెలుగు, ఉర్దూ, ఫార్సీ పదాలను పుస్తకంలో సరిగా వచ్చేలా శ్రద్ధ తీసుకొని ఈ ఆత్మకథను జీవం పోశారు. ఈ శ్రమలో ఆయనకు తాళ్లపల్లి మురళీధర్ గౌడ్, వాధూలస తోడు నిలిచారు. గురుదేవ్ సింగ్ ప్రచురణకర్తగా తన ముత్తాత చరిత్రకు ముద్రణ రూపం కల్పించారు.
రాఘవపట్నం రామసింహకవి (ఆత్మకథ), సంపాదకుడు వేముల ప్రభాకర్, పేజీలు 240, వెల : రూ. 200/, ప్రచురణ, ప్రతులకు : నవోదయ బుక్ హౌజ్ మరియు గురుదేవ్ సింగ్ 7702528099.