Monday, December 23, 2024

ఆటోఇమ్యూన్ వ్యాధులపై అశ్రద్ధ పనికిరాదు

- Advertisement -
- Advertisement -

ఊబకాయులైన వారిలో టైప్1 డయాబెటిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు (స్వయం ప్రతిరక్షక వ్యాధులు autoimmune diseases) సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనడానికి సాక్షాలు బలంగా ఉన్నాయి. ఈ సంబంధాన్ని వివరించగల సాధ్యమైన యంత్రాంగం ఒకటి ఉంది. జీవక్రియకు సంబంధించిన అత్యధిక భారం వ్యాధినిరోధక వ్యవస్థ క్రమబద్ధీకరణపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు తాపజనక ప్రతిస్పందనల(inflammatory responses) ను ప్రేరేపిస్తుంది.

ఫలితంగా ఆటోఇమ్యూన్ వ్యాధులకు ఆస్కారం కలుగుతుంది. మనిషి శరీరం వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఒక రక్షణ వ్యవస్థ మనలో ఉంటుంది. ఆరోగ్యానికి హాని కలిగించే వైరస్ మన శరీరంలో ప్రవేశిస్తే ఈ రక్షణ వ్యవస్థ వైరస్‌తో పోరాడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన రక్షణ వ్యవస్థ పొరపాటున తన స్వంత శరీరం పైనే దాడి చేసే సంఘటనలు జరుగుతుంటాయి. దీనివల్ల మనశరీరం అనేక వ్యాధుల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అదే ఆటోఇమ్యూన్ వ్యాధులుగా శాస్త్రవేత్తలు పరిగణిస్తుంటారు.

థైరాయిడ్, సొరియాసిస్, రక్తహీనత, కండరాల నొప్పులు, మధుమేహం (diabetis) వంటి అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
1) రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ఇది ఇన్‌ఫ్లెమేటరీ ఆర్ధరైటిస్. జీవ క్రియలో అసమతుల్యత వల్ల ఈ వ్యాధి వస్తుంది. శరీరంలో కీళ్లు తీవ్రమైన వాపులకు గురవుతాయి. కీళ్ల కదలికలు పూర్తిగా స్థంబిస్తాయి.
2) థైరాయిడ్ శరీరంలో యాంటీబాడీలు ఒక్కోసారి థైరాయిడ్ గ్రంధికి వ్యాపిస్తాయి. ఇది క్రమం కావాలంటే కొన్ని నెలలు,సంవత్సరాలు పడుతుంది. రేడియేషన్ తీసుకున్న కారణంగా కొందరిలో థైరాయిడ్ గ్రంధి దెబ్బతింటుంది. హైపోథైరాయిడిజం రావచ్చు. మలబద్ధకం, కుంగుబాటు, నీరసం, అలసట, వెంట్రుకలు రాలిపోవడం, గోళ్లు విరగడం, కాళ్లూ చేతులు వాచిపోవడం, గొంతుబొంగురు పోవడం వంటి అవలక్షణాలు వస్తాయి.

3) సొరియాసిస్ శరీరం అంతా పొలుసులుగా ఏర్పడే దీర్ఘకాలిక చర్మవ్యాధి. ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల , వీపు, అరిచేతులు, అరికాళ్లు, పొట్ట, మెడ, నుదురు, చెవులు వంటి భాగాలలో ఇది వ్యాపిస్తుంటుంది. చర్మం ఎర్రబారి, జుట్టు రాలిపోతుంది. కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడవచ్చు. నెత్తురు కారుతుంది.
4) మధుమేహం మధుమేహంలోటైప్1, టైప్2 అనే రెండు రకాలున్నాయి. టైప్1 వ్యాధి ఇరవై ఏళ్ల కన్నా ముందునుంచే ప్రారంభమౌతుంది. టైప్ 2 వ్యాధి ఇరవై ఏళ్లు దాటాక వస్తుంది. ప్రపంచ జనాభాలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటోంది. ఆకలి, నీరసం, దాహం ఎక్కువగా ఉండటం, అతిమూత్రం, చూపు మందగించడం, వేగంగా బరువు తగ్గడం, తలనొప్పి తరచుగా రావడం, గుండెదడ, చెమటలు పట్టడం, గాయమైతే మానక పోవడం, కాళ్లూ చేతులు తిమిరెక్కడం వంటి లక్షణాలు ఉంటాయి.

5) ఎస్‌ఎల్‌ఇ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమెటసిస్, వ్యాధి గ్రస్తుల్లో శరీరం లోని అవయవాలు వ్యాధిగ్రస్తంగా మారిపోతాయి. జన్యుపరమైన, వాతావరణపరమైన, కారణాలే కాకుండా, మానసిక ఒత్తిళ్లు కూడా ఈ వ్యాధికి దారి తీస్తాయి. ముఖంపై దద్దుర్లు వస్తుంటాయి. చర్మం ఎర్రబడుతుంది. నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కండరాలు, కీళ్ల నొప్పులు , పొలుసులు రావడం, ఈ వ్యాధి లక్షణాలు. వీటితోపాటు శరీరమంతా వాపులు రావడం, బరువు పెరగడం, వంటి లక్షణాలు బయటపడతాయి. దీర్ఘకాలంలో ఈ వ్యాధి కారణంగా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే లోపల పిండం చనిపోతుంది. లేదా గర్భస్రావం జరుగుతుంది.
ఆటోఇమ్యూన్ వ్యాధుల విషయంలో మొదట్లోనే లక్షణాలు గుర్తించగలిగితే చాలా మేలు జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వెంటనే చికిత్సప్రారంభిస్తే చాలావరకు వీటిని నయం చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News