డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. దీంతో శుక్రవారం బద్రీనాథ్ దామ్‌లోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఒక్కసారిగా మంచుచరియలు విరుచుకుపడ్డాయి. దీంతో వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఒ) అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.
మొత్తం 57 మంది కార్మికులు మంచుచరియల కింద చిక్కుకుపోయినట్లు బిఆర్ఒ అధికారి మీనా తెలిపారు. మనా గ్రామంలో ఉన్న బిఆర్‌ఒ క్యాంప్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటికే 16 మందిని రక్షించి క్యాంప్‌నకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని బిఆర్‌ఒ అధికారులు తెలిపారు.