డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని బాగా ఎత్తులో ఉన్న సరిహద్దు గ్రామం మనా సమీపాన మంచును తొలగించే పనిలో ఉన్న 41 మంది బిఆర్‌ఒ కార్మికులు శుక్రవారం విరిగిపడిన మంచు చరియల కింద చిక్కుకుపోయారు. మంచు చరియలు విరిగిపడినప్పుడు తొలుత 57 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కాని వారిలో 16 మందిని సురక్షితంగా సహాయ సిబ్బంది మంచుచరియల కింద నుంచి తరలించారు. మనా, బద్రీనాథ్ మధ్య సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్‌ఒ) శిబిరాన్ని విరిగిపడిన మంచుచరియలు కప్పివేశాయి.
కార్మికులను రక్షించేందుకు పలు బృందాలు ఆ సంక్లిష్ట ప్రాంతం, భారీ మంచు, వర్షం మధ్యలో తీవ్రంగా శ్రమించారని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారి తెలియజేశారు. అయితే, ఈ దుర్ఘటనలో మరణాల గురించి వెంటనే ఎటువంటి సమాచారమూ రాలేదని ఆయన తెలిపారు. బడ్రీనాథ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని మనా భారత, టిబెట్ సరిహద్దులో 3200 మీటర్ల ఎత్తున ఉన్న చివరి గ్రామం. ఉదయం మనా, మనా కనుమ మధ్య మంచుచరియలు విరిగిపడినప్పుడు శిబిరంలో 57 మంది కార్మికులు ఉన్నారని తివారి తెలియజేశారు.
‘ఆ కార్మికులు టిబెట్ సరిహద్దు వైపు సైన్యం రాకపోకల కోసం దారిలో ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తుంటారు& ప్రస్తుతం మాకు ఏవైనా మరణాలు సంభవించాయా అన్న సమాచారం ఏదీ అందలేదు.రక్షక బృందాలను సమీకరించాం. కానీ ఆ ప్రాంతంలో దట్టంగా మంచు, వర్షం కురుస్తున్నందున రక్షణ, సహాయ కార్యక్రమాలు మందగించాయి’ అని ఆయన వివరించారు. మంచు, వర్షం కురుస్తున్నా రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుంచి దాదాపు 300 కిమీ దూరంలోని ఆ ప్రదేశానికి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి.
‘మంచుచరియలు విరిగిపడినప్పుడు చిక్కుకుపోయిన 57 మంది బిఆర్‌ఒ కార్మికుల్లో 16 మందిని రక్షించడమైంది. తక్కినవారిని రక్షించేందుకు కృషి సాగుతోంది. రక్షణ, సహాయ కార్యక్రమాల్లో ఐటిబిపి, ఇతర విభాగాల సాయం తీసుకుంటున్నారు. మా విపత్తు స్పందన శాఖ, పూర్తి పాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విలేకరులతో చెప్పారు. ‘సాధ్యమైనంత వనకు అందరినీ సురక్షితంగా వెలుపలికి తీసుకురావడానికే మేము కృషి చేస్తున్నాం’ అని సిఎం తెలిపారు,