వాణిజ్య ఎల్‌పిజిపై రూ. 249.50 వడ్డన
న్యూఢిల్లీ: విమానాల ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఎటిఎఫ్) ధర ఈ ఏడాదిలో వరుసగా ఏడవసారి అత్యధికంగా 2 శాతం పెరిగింది. కిలోలీటరుకు రూ.2,258.54 చొప్పున లేదా 2 శాతం చొప్పున శుక్రవారం పెరిగింది. దేశ రాజధానిలో కిలోలీటరు రూ.1,12,924.883(రూ.112.92 లీటరుకు)కు చేరుకున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు శుక్రవారం తెలిపాయి. కాగా..వాణిజ్యావసరాలకు ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.249.50 పెరిగింది. దీంతో 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 2,253కు చేరుకుంది.
అయితే గృహావసరాలకు వినియోగించే వంటగ్యాసు ధరలో ఎటువంటి మార్పులు లేవు. మార్చి 22న వంటగ్యాసు ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలలో కూడా ఎటువంటి మార్పులు లేవు. అయితే..గత 11 రోజుల్లో 10 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో మొత్తంగా లీటరుకు రూ. 6.40 చొప్పున వాటి ధరలు పెరిగాయి. ఎటిఎఫ్ ధరలను ప్రతినెల 1వ తేదీ, 16వ తేదీన సవరిస్తారు. ఎల్‌పిజి ధరలను నెలకోసారి సవరిస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రకారం రోజువారీగా సవరిస్తారు.