పారిస్: ఫ్రెంచ్ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకారాలను అవకాశాలను అందిస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రతినిధి బృందం రెండవ రోజు పారిస్‌లో వివిధ గ్లోబల్ సీఈఓలతో సమావేశాలు నిర్వహించింది. ఫ్రాన్స్‌లో వ్యాపార పర్యటనలో భాగంగా రెండో రోజు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కెటిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పారిస్‌లో మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఇడిఇఎఫ్) డిప్యూటీ సిఇఒ జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఎంఇడిఇఎఫ్ అనేది ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ కావడంతో ఫ్రాన్స్ లో 95% కంటే ఎక్కువ వ్యాపారాలు ఆ కంపెనీ నిర్వహిస్తోంది. ఎస్ఎంఇలు కలిగి ఉన్న ఫ్రాన్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తల నెట్‌వర్క్ ఎంఇడిఇఎఫ్.
ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను తెరిచిందన్నారు. అనంతరం ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌లో మంత్రి కెటిఆర్ పర్యటించారు. స్టేషన్ ఎఫ్ బృందంతో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో టిహబ్, విహబ్, టివర్క్స్ వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థలతో అవకాశాలు, సహకారం గురించి చర్చించారు. స్టేషన్ ఎఫ్ అనేది ప్యారిస్ నడిబొడ్డున ఉన్న ఒక ప్రత్యేకమైన క్యాంపస్-కమ్యూనిటీ అని, ఇందులో 1,000 స్టార్టప్‌లు ఉన్నాయి. వాస్తవానికి రైల్వే డిపోగా ఉన్న ఈ క్యాంపస్ ఇంక్యుబేటర్‌గా మార్చడానికి పునర్ నిర్మించబడింది.
మంత్రి కెటిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పారిస్‌లో ఎడిపి చైర్మన్, సిఇఒ అగస్టిన్ డి రోమనెట్‌తో సమావేశమైంది. ఎడిపి ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడి పెట్టింది. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. భారతదేశంలో విమానయాన రంగం వేగవంతమైన వృద్ధి దశలో ఉందని, కరోనా ఆంక్షలు సడలించడంతో విమానయాన పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
అనేక ప్రధాన ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని మంత్రి తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సరఫరా చేయాల్సిన అవసరాన్ని కెటిఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. మరో సమావేశంలో పరిశ్రమల మంత్రి కెటిఆర్ పారిస్‌లో సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుండి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.