న్యూఢిల్లీ : గత వారం రోజులుగా రోజుకు దాదాపు 3.82 లక్షల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం తెలిపారు. ఇది కొవిడ్ ప్రభావిత రంగానికి ఆశాకిరణం లాంటిదన్నారు. 2023 24 నాటికి రద్దీని దాదాపు మూడు రెట్లు 400 మిలియన్లకు పెంచాలని లక్షంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సరిశ్రమ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో జెట్, అకాలా త్వరలో కొత్తగా సేవలు ప్రారంభించబోతున్నాయన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం ఈ రంగంలో మార్పులను తీసుకువచ్చిందని, నిర్మాణాత్మక మార్పు జరిగిందన్నారు.
డిజిసిఎ గణాంకాల ప్రకారం 2013 14 లో ప్రయాణికుల సంఖ్య 6.70 కోట్లు కాగా, 2018 19 లో 14.50 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో 2013 14 లో విమానాల సంఖ్య 400 కాగా, 201819 లో 710 కి పెరిగింది. డీజిసీఎ ప్రకారం 2021 లో 838 మిలియన్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. 2020 లో ఈ సంఖ్య 6.3 కోట్లు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తాజాగా విమానయాన రంగం పుంజుకుంటున్నది. నవంబర్ 2021 లో దేశంలో ప్రయాణికుల సంఖ్య రోజుకు 3.90 లక్షలకు పెరిగిందని, కరోనాకు ముందు రోజుకు ఈ సంఖ్య 4.15 లక్షలుగా ఉండేదన్నారు. ఒమిక్రాన్ ప్రవేశంతో 1.60 లక్షలకు తగ్గిందని, ప్రస్తుతం గత వారం రోజులుగా 3.82 లక్షలకు పెరిగిందని వివరించారు.