Wednesday, January 22, 2025

వివేకా హత్యకు అవినాష్‌రెడ్డి, భాస్కర రెడ్డి కుట్ర

- Advertisement -
- Advertisement -
చార్జిషీట్‌లో పలు అంశాలను ప్రస్తావించిన సిబిఐ

హైదరాబాద్ : మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారని జూన్ 30న సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కూడా ప్రస్తావించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని, వివేకా పిఎ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని వెల్లడించింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని పేర్కొంది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని, వివరాలు ఇవ్వాలని అధికారులను కోరామని వెల్లడించింది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాలని చెప్పింది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ రిపోర్టులు త్రివేండ్రం సీడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది.

నిందితులు సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, కడప ఎంపిఅవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి పరిసరాల్లోనూ ఉన్నారని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నట్లు సిబిఐ పేర్కొంది. ప్రాధమిక చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలు తుది చార్జిషీట్ లో మార్పులు చేశామని తెలిపింది. వివేకానందరెడ్డి ఇంట్లో 2019, మార్చి 14న రాత్రి సునీల్ యాదవ్ వున్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడని.. సునీల్ సెల్ నెంబ్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామని సీబీఐ గతంలో వెల్లడించింది. తాజాగా తుది నివేదికలో ఇది నిజం కాదని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత సునీల్ యాదవ్ లేడని, 2019, మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, 8.12 గంటలకు ఇంటి లోపల వున్నాడని తెలిపింది. గతంలో యుటిసి గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలని, గతంలో సమాచార సేకరణలో పొరపాటు జరిగిందని తాజా చార్జిషీట్‌లో సిబిఐ వెల్లడించింది.

కోల్డ్ వార్ ఉండేది : వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సిబిఐకి ఇచ్చిన తన వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇచ్చిన ఈ వాంగ్మూలంలో వైఎస్ వివేకా హత్య ఆర్థిక కారణాలతో కాదు, రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొన్నారు. తన వద్ద ఆధారాలు లేవని, కానీ, రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగినట్టు తాను నమ్ముతున్నానని వివరించారు. అవినాష్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడ్డారని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండొచ్చేమో అని పేర్కొన్నారు. 259వ సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని కోర్టుకు సిబిఐ అందించింది. వివేకా హత్యకు గురికావడానికి ముందు బెంగళూరులోని తమ ఇంటికి ఆయన వచ్చారని షర్మిల తన వాంగ్మూలంలో చెప్పారు. తనను కడప ఎంపిగా పోటీ చేయాలని కోరారని వివరించారు. ఎంపిగా అవినాష్ రెడ్డి పోటీ చేయవద్దని కోరుకుంటున్నట్టు తనకు తెలిపారని చెప్పారు. అవినాష్‌కు టికెట్ ఇవ్వకుండా జగన్‌ను కన్విన్స్ చేయాలని తనను కోరారని వివరించారు. బాగా ఒత్తిడి చేయడంతో తాను ఎంపీగా పోటీ చేయ డానికి సరేనని చెప్పట్టు పేర్కొన్నారు. అయితే, స్వయంగా వివేకాను పోటీ చేయవచ్చు కదా? షర్మిలను ఒత్తిడి చేయడమెందుకు అని సిబిఐ ప్రశ్నించగా ఎంఎల్‌సిగా ఓడిపోయినందున ఆయన ఎంపి పోటీకి ఆసక్తి చూపలేదేమో అని షర్మిల పేర్కొన్నారు. అదీగాక, ఆయన విజయమ్మపై పోటీ చేశారు కాబట్టి, టికెట్ దక్కే అవకాశాలు ఉండవని భావిం చారని వివరించారు. కుటుంబంలో అంతా బాగున్నట్టు కనిపించినా లోపల అలా లేదని వైఎస్ షర్మిల తన వాంగ్మూలంలో చెప్పారు. లోపల కోల్డ్‌వార్ జరిగేదని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు ఎంఎల్‌సిగా వివేకానంద ఓటమికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మరికొందరు సన్నిహితులే కారణమై ఉంటారని తన నమ్మకం అని షర్మిల వివరించారు.

వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి : సిబిఐ
వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐ సిఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సాక్షిగా పేర్కొంది. ఈ మేరకు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని, కోర్టుకు అందించింది. కృష్ణమోహన్‌రెడ్డి వాంగ్మూలంలో కీలక వివరాలు పేర్కొన్నారు. ‘ఓ కీలక సమావేశం జరుగుతుండగా అటెండర్ నవీన్ తలుపు తెరిచారు. సమావేశం నుంచి బయటికి రావాలని నవీన్ నన్ను కోరారు. అవినాశ్ రెడ్డి మాట్లాడతారంటూ నవీన్ నాకు ఫోన్ ఇచ్చారు. వివేకానందరెడ్డి మరణించారని అవినాష్ నాకు ఫోన్ లో చెప్పారు. ఎలా జరిగిందని అవినాశ్ రెడ్డిని అడిగాను. బాత్రూంలో మృతదేహం ఉందని అవినాష్ చెప్పారు. బాత్రూంలో చాలా రక్తం ఉందని కూడా అవినాష్ చెప్పారు. దీనిపై జగన్ కు సమాచారం ఇవ్వండి అని చెప్పి అవినాష్ ఫోన్ పెట్టేశారు. వివేకా మరణం విషయం నేను జగన్‌కు చెవిలో చెప్పాను. బాత్రూంలో, బెడ్రూంలో రక్తం విషయం కూడా చెప్పాను. జగన్ ముందు ఇంటికి వెళ్లి, ఆ తర్వాత పులివెందుల వెళ్లారు. ఇక, అవినాష్‌తో ఐదుసార్లు ఎందుకు మాట్లాడారని సిబిఐ అడిగింది. బహుశా జగన్ పర్యటన కోసమే అవినాష్‌తో అన్నిసార్లు ఫోన్లో మాట్లాడి ఉంటానని చెప్పాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్ ఫోన్ వాడరు. పిఎ ఫోన్ లేదా నా ఫోన్ లోనే మాట్లాడతారు‘ అంటూ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వివరించారు. అటు, వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ అటెండర్ జి.నవీన్ వాంగ్మూలాన్ని కూడా సిబిఐ నమోదు చేసింది. ‘ఉదయం 6.30 గంటలకు అవినాశ్ ఫోన్ చేసి జగన్ ఉన్నారా? అని అడిగారు. కృష్ణమోహన్ రెడ్డి, జీవీడీలతో జగన్ సమావేశంలో ఉన్నారని చెప్పాను. కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వమని అవినాష్ కోరారు. దాంతో, సమావేశం జరుగుతున్న గది వద్దకు వెళ్లి, అవినాష్ లైన్ లో ఉన్నారంటూ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ ఇచ్చాను. అవినాష్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు‘ అని నవీన్ తన వాంగ్మూలంలో వివరించారు. కాగా, ఈ వాంగ్మూలాలను సీబీఐ జూన్ 30న కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ సిఎస్ అజేయ కల్లం నుంచి వాంగ్మూలాలు సేకరించిన సిబిఐ వాటిని కూడా కోర్టుకు సమర్పించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News