ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా
న్యూఢిల్లీ: కొవిడ్19 స్వల్ప లక్షణాలున్నవారు సిటి స్కాన్ తీయించుకోవడం వల్ల మంచికన్నా చెడే ఎక్కువని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా॥రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. ఒక్కో సిటి స్కాన్ 300 నుంచి 400 చాతీ ఎక్స్‌రేలు తీయించుకోవడంతో సమానమని ఆయన తెలిపారు. సిటి స్కాన్లు పదేపదే తీయించడం వల్ల యువకులు తమ భవిష్యత్ జీవితంలో కేన్సర్ బారిన పడే ప్రమాదమున్నదని ఆయన హెచ్చరించారు. సిటి స్కాన్ వల్ల రేడియేషన్‌కు గురి అవుతారని తెలిపారు. ఆక్సిజన్ సాధారణస్థాయిలో ఉన్నవారికి సిటి స్కాన్ అవసరంలేదని ఆయన తెలిపారు. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే సిటి స్కాన్ తీయాలని ఆయన సూచించారు. ఆక్సిజన్ సాధారణస్థాయిలో ఉండి, జ్వరం పెద్దగా లేనివారికి మధ్యస్థ లక్షణాలున్నా బయోమార్కర్లను గుర్తించే బహుళ రక్త పరీక్షలు అవసరంలేదని ఆయన సూచించారు. వీటి వల్ల కూడా నష్టమేనని ఆయన తెలిపారు. మధ్యస్థ లక్షణాలున్నవారికి మూడు రకాల చికిత్సలు సమర్థవంతంగా పని చేస్తాయని ఆయన సూచించారు. అవి.. ఆక్సిజన్ థెరపీ, స్టీరాయిడ్స్, రక్తం గడ్డకట్టకుండా వాడే మందులని ఆయన తెలిపారు.