ఆర్టీసిలో ఇంధన పొదుపు చాలా కాలం నుంచి కొనసాగుతుంది
దీనిపై అసత్య కథనాలు మానుకోండి
ఆర్టీసి ఎండి, విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసిలో ఇంధన పొదుపు చాలా కాలం నుంచి కొనసాగుతుందని, దీనిపై కొందరు అసత్య కథనాలను ప్రచురిస్తున్నారని ఆర్టీసి ఎండి, విసి సజ్జనార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధన పొదుపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు పారితోషికంతో పాటు అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తు న్నామన్నారు. ఈ ఇంధన పొదుపు వలన ఇటు సంస్థకు అటు డ్రైవర్లకు లాభసాటిగా ఉంటుందన్నారు. సాధారణంగా ఆర్టీసిలో ఒకే రూట్లలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లలో ఒకరు తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజీని తీసుకొస్తూ ఖర్చును తగ్గిస్తూ సంస్థ అభ్యున్నతికి తోడ్పాటునం దిస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ చేసి డ్రైవింగ్‌లో మెళకువలను నేర్పుతున్నామన్నారు. సంస్థ ప్రతి రోజు 32లక్షల కిలోమీటర్లు నడుపుతూ సగటున 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుందని ఆయన తెలిపారు. డ్రైవర్లు తమ నైపుణ్యంతో బస్సును నడిపి 0.10 పాయింట్లకు కెఎంపిఎల్ పెంచగలిగితే సంస్థకు సాలీనా రూ.40 కోట్లు ఆదా చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం, సామర్థ్యం రెండూ ముఖ్యమే
కెఎంపిఎల్ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన సంబంధిత డ్రైవర్ల నుంచి జీతంలో కోత విధించాలని సంస్థ యాజమాన్యం ప్రతిపాదించినట్లు పలు పత్రికల్లో వస్తున్న ఆరోపణలు నిజం కాదనీ టిఎస్ ఆర్టీసి విసి అండ్ ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టిఎస్ ఆర్టీసి సుమారు 48వేల మంది సిబ్బందిని కలిగి ప్రజా రవాణా వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. ఉద్యోగుల పనితీరును అంచనా వేయడం అనేది సంస్థలో కొనసాగుతున్న నిరంతర ప్రక్రియగా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసి డిపోల్లో సంక్షేమ బోర్డులు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఉద్యోగుల తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కొందరు స్వార్థపరులు కావాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డపేరు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.