నేపిడా: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు కారణంగా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినేత్రి ఆంగ్‌సాన్ సూకీ సహా ఆ పార్టీకి చెందిన కీలక నేతలను ఆ దేశ మిలిటరీ అదుపులోకి తీసుకొంది. అంతేకాక ఏడాది పాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటుగా పరిపాలనను తన చేతుల్లోకి తీసుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యాంగూన్‌లోని భారత దౌత్య కార్యాలయం భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిసితుల్లో మయన్మార్‌కు రాకపోవడం మంచిదని సూచించింది. సాధ్యమైనంత వరకు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పేర్కొంది. ప్రస్తుత సంక్షోభం సమసిపోయి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మయన్మార్ రావాలని తెలియజేసింది. అలాగే మయన్మార్‌లోని భారత ప్రవాసులు సైతం అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరింది. మరో వైపు ఎయిరిండియా కూడా సోమవారం నాటి ఘటనల తర్వాత యాంగూన్-న్యూఢిల్లీ విమాన సర్వీస్‌ను రీ షెడ్యూల్ చేసింది.
Avoid travel to Myanmar says Indian Embassy