Monday, January 20, 2025

అప్రమత్తతతోనే ఆపదల నివారణ

- Advertisement -
- Advertisement -

మానవుడు నాగరికత నేర్చుకునే క్రమంలో కనుగొన్న వాటిల్లో నిప్పు ఒకటి. మనిషి జీవిత ప్రయాణంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్న ఈ నిప్పు ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలను సైతం తీస్తుంది. ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ముఖ్యంగా పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. పరిశ్రమలు మాత్రమే కాదు గృహ, వ్యాపార సముదాయాల్లో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు మేలుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. ప్రజల కోసం అగ్నిమాపక సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించి, వారిని గౌరవించడం కోసం ప్రతి ఏడాది మే 4న ‘అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాధారణంగా వేసవిలోనే అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. విద్యుత్తు వినియోగంతో పాటు దీపాలు వెలిగించడంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వంట చేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపకూడదు. ఒక్కోసారి ఒకరింట్లో జరిగిన ప్రమాదంతో చుట్టుపక్కల ఇళ్లు అగ్నికి ఆహుతవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గడ్డివాములు, పూరిళ్లు ఉన్నప్పుడు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్టో, చుట్టో, బీడీనో తాగి, ఆ పీకలు నిర్లక్ష్యంగా విసిరేస్తుంటారు. ఇలాంటివి సైతం భారీ అగ్నిప్రమాదాలకు దారితీస్తాయి. ఇది ప్రపంచం, దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం.. చివరకు మన నివాస ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరగడం చూస్తుంటాం. అందుకే అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాల్ని అరికట్టవచ్చు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాథమిక దశలోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చు. ఎండల ప్రభావం కారణంగా ఇళ్లు, గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, మిల్లుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో ఆస్తినష్టమే కాక ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. ఏటా ఎక్కడో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండగా సర్వస్వం కోల్పో యిన కుటుంబాలు వీధిన పడతాయి. అయితే ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడమే కాక… అగ్నిమాపక శాఖ కు సమాచారం ఇస్తే ప్రమాద తీవ్ర అవకాశముంటుంది. వారోత్సవాల్లో భాగంగా భారీ అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించి ఆస్తులు, ప్రాణాలను కాపాడేందుకు మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక శాఖ అప్రమత్తం చేస్తుంది.
ఇదే సమయాన అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేస్తారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. అందుకోసం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి.

వీటి పరిధిలోని ఆయా విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖలకు చెందిన సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తుంటారు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో అయినా ఆపదలో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సాహసాలకు, త్యాగాలకు నివాళులర్పించేందుకు 1944లో జాతీయ స్థాయిలోనూ, 1999లో ఆస్ట్రేలియాలోని విక్టోరియల్ లింటన్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మరణించారు. వారిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మే 4వ తేదీన అంతర్జాతీయంగా అగ్నిమాపక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరం మన చుట్టూ ఉండే పరిసరాలు, ప్రాంతాల్లో మానవ తప్పిదాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

అలాగే నీరు, వాయువు కాలుష్యంతోనూ, పరిశ్రమల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏ కారణాలతో జరిగినా అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, వ్యాపార కూడళ్ళు, ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రాణనష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అగ్నిమాపక శాఖకు వెంటనే తెలియజేయటం ద్వారా చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.

అయితే ప్రతి ఒక్కరూ ప్రమాదాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానం అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రమాదా లకు అవకాశం ఎక్కువ ఉంటున్న కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు ఇళ్లల్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌ల నుంచి విద్యుత్ వినియోగం వరకు ప్రతీ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో అగ్నిప్రమాదం జరిగితే వడగాలులకు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి భారీ నష్టం జరిగే అవకాశముంది. ఊరేగింపులు, వివిధ కార్యక్రమాల సందర్భంగా కాల్చే టపాసులు గడ్డివాములు, ఇళ్లపై పడి అగ్నిప్రమాదాల వల్ల ప్రాణహాని జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నివారించవచ్చును.

ఎక్కులూరి నాగార్జున్‌రెడ్డి
9032042014

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News