ముంబయి: నటి హేమా మాలిని, యాడ్‌మ్యాన్ ప్రసూన్ జోషికి గోవాలో శనివారం జరుగనున్న ‘ది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫ్ఫీ) 2021’లో ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఇవ్వబోతున్నారు. హేమా మాలిని మథురా నియోజకవర్గం నుంచి బిజెపి ఎంపీగా రెండు టర్ముల నుంచి ఉన్నారు. ఇక జోషని భారత ప్రభుత్వం 2017లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌కు చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార పాటను కూడా రాశారు. వీరిద్దరికి అవార్డునిచ్చే ప్రకటనను గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ చేశారు. ‘భారత సినిమా పరిశ్రమకు వారు దశాబ్దాలుగా తమ సేవలను అందించారు. దేశవ్యాప్తంగా వివిధ తరాలను వారు అలరించారు. వారు భారత సినీ దిగ్గజాలు. ప్రపంచవ్యాప్తంగా వారిని ప్రశంసిస్తుంటారు” అని అనురాగ్ ఠాకుర్ తెలిపారు.