మనతెలంగాణ, హైదరాబాద్ : విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిసనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులకు సిపి స్టిఫెన్ రవీంద్ర పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన సైబరాబాద్ పోలీసులు ఉత్తమ పోలీసు అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు.
పోలీసులు కుటుంబ సభ్యులను పండగలకు వదులు కుని విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. మెడల్స్ సాధించిన పోలీసులకు ప్రభుత్వం, తెలంగాణ పోలీసుల తరఫున అభినందనలు తెలిపారు. 2015 నుంచి 2022 సంవత్సరానికి గాను సైబరాబాద్ నుంచి 154మంది పోలీసులను ఎంపిక చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 74మందికి సేవా పతకాలు, 34మందికి అతిఉత్కృష్ణ పతకాలు, 46మందికి ఉత్కృష్ట పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సిపి నారయణ్ నాయక్, డిసిపి శ్రీనివాస్‌రావు, ఎడిసిపి రియాజ్, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.