Wednesday, January 22, 2025

క్షయ నియంత్రణలో రాష్ట్రానికి అవార్డులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిబి రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టిబి నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నాలుగు జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర టిబి విభాగం అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. టిబి నిర్మూలన కార్యక్రమా ల సూచికల ఆధారంగా, తెలంగాణ ప్రస్తుతం దే శంలోనే మూడో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా నిలిచింది. 2015 కేసులతో పోల్చితే తెలంగాణలో క్షయ వ్యాధి కేసుల తగ్గింపు ప్రతి లక్ష జనాభాకు గణనీయంగా తగ్గింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం, తగ్గింపు లక్ష్యం 80 శాతం కాగా, 60 శాతం తగ్గించిన నిజామాబాద్‌కు బంగారు పతకం, 40 శాతం తగ్గించిన భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు వెండి, 20 శాతం తగ్గించిన ఖమ్మంకు కాంస్య పతకాలు వరించాయి. కార్యక్రమంలో భాగంగా అందించిన అవార్డులను రాష్ట్ర టిబి విభాగం జెడి డాక్టర్ ఎ రాజేశం, నిజామాబాద్ డిఎంహెచ్‌వో సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ శ్రీగణ, ప్లానింగ్ ఆఫీసర్ వాసుప్రసాద్‌లు రాష్ట్రప్రభుత్వం తరుపున అందుకున్నారు. రాష్ట్రంలో క్షయ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నది.

ఇందులో భాగంగా టిబి పరీక్షల సంఖ్య భారీగా పెంచడంతోపాటు వైద్య సహాయం తక్షణమే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కుటుంబంలో ఒక్కరికి టిబి గుర్తిస్తే మిగతా సభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిని అపెక్స్ టిబి ఆసుపత్రిగా గుర్తించడంతోపాటు మల్టీ డ్రగ్ థెరపీ, డ్రగ్ రెసిస్టెన్స్ టిబి చికిత్స పొందేవారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నది. ఈ మేరకు అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి పని చేస్తున్నది. తెలంగాణలో ప్రత్యేకంగా టిబి నుంచి కోలుకున్నవారిని టిబి ఛాంపియన్స్ గా గుర్తించి శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ప్రజలలో అవగాహన తెస్తున్నాం. ఈ టిబి ఛాంపియన్స్ ప్రత్యేక మొబైల్ యాప్ దీక్ష ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. టిబి వ్యాధి బారిన పడిన వారికి ప్రభుత్వం “నిక్షయ్ పోషణ యోజన” కింద పోషకాహారం కోసం ప్రతి నెల రూ.500 చొప్పున వ్యాధి నుంచి బయటపడే వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. టిబి తీవ్రత ఎక్కువగా ఉండి మల్టి డ్రగ్ థెరపీ తీసుకునేవారికి రూ.1200 రవాణా ఛార్జీలు, గిరిజన ప్రాంతాలతో వీటికి అదనంగా మరో రూ.750 అందిస్తున్నాం. బాధితులకు పోషకాహార కిట్స్ అందివ్వడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల టిబి నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యం : మంత్రి హరీశ్‌రావు

టిబి నియంత్రణలో సత్తా చాటి అవార్డులు పొందిన జిల్లాలకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యాధికారులను అభినందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణలో 2025 నాటికి పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి (టిబి) నిర్మూలనే లక్ష్యంగా నిర్ధేశించుకుని టిబి పరీక్షలు, వైద్యం వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టిబి నిర్మూలన లక్ష్యం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News