కరీంనగర్: ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఓటు వినియోగంపై ఎవరికి ఎటువంటి సందేహాలు లేకుండా స్పష్టతను ఇచ్చేలా ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలు, ప్రత్యేక కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ ప్రారంభించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం అవగాహన కేంద్రాన్ని, మొబైల్ వాహనాలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల, నియోజకవర్గాలకు చెందిన తహసిల్దార్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటు యంత్రాల ద్వారా ఓటు వినియోగం, అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరికి యంత్రాలపై స్పష్టతను, అవగాహనను కల్పించే దిశగా హుజురాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గ కేంద్రాలలోని తహసిల్దార్ కార్యాలయాల్లో, కరీంనగర్ నియోజక వర్గానికి చెందిన కేంద్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని దీంతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిపాట్‌లతో పాటు ఈవీఎం డిమాన్షేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జూలై 15 వరకు వచ్చిన ఓటరు దరఖాస్తులను జూలై 27న డిస్పోజల్ చేయాలని, ఆగస్టు 4 వరకు పోలింగ్ కేంద్రాల మార్పు, ఇతర చర్యలకై ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని ఆగస్టు 21న డ్రాప్ట్ రోల్ పబ్లిషింగ్‌చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ ఆర్డీవో కె మహేశ్వర్, కలెక్టరేట్ ఎఓ జగత్‌సింగ్, నియోజకవర్గాల తహసిల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.