డా అనిత కున్నయ్య సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజీ విభాగం
మన తెలంగాణ/హైదరాబాద్: తల్లిపాలను రక్షించాలని, ఇది ఒక భాగస్వామిక బాధ్యతని గైనకాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డా అనిత కున్నయ్య తెలిపారు. వరల్డ్ మథర్ మిల్క్ వీక్ సందర్భంగా ఆమె తల్లి పాలపై అవగాహన కల్పిస్తూ గురువారం ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.తల్లిపాలన ప్రోత్సహించడం వలన తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. నవజాత శిశువులు, పసిపిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు తల్లిపాలను మించిన ఆహారం లేదన్నారు. ఇది పునరుత్పత్తి ప్రక్రియలో అంతర్భాగం అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువులకు ఆరు నెలల పాటు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని ఆమె గుర్తుచేశారు. తల్లి పాల వినియోగాన్ని పెంచేందుకు ప్రతి వ్యక్తి బాధ్యతగా అవగాహన కల్పించుకోవాలన్నారు. పుట్టిన శిశువులకు తల్లిపాలను ఇవ్వడమే మొదటి సహజమైన ఆహారమన్నారు. తల్లిపాలు ఇంద్రియ, మనోవికాసాన్ని పెంపొందిస్తుందన్నారు. అంటు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శిశువులను రక్షిస్తుందన్నారు. చనుబాలివ్వడం వలన అతిసారం, న్యూమోనియా వంటి సాధారణ బాల్య రోగాల కారణంగా శిశుమరణాలను తగ్గిస్తుందన్నారు. అనారోగ్యం సమయంలో శిశువులు త్వరగా కోలుకోవడానికి వీలవుతుందన్నారు. ఇది పిల్లల మధ్య దూరాన్ని పాటించడంలో సహయపడుతుందన్నారు. అండాశయ, రొమ్ముక్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు.
టీకా తీసుకున్న తర్వాత కూడా పాలివ్వొచ్చుః
చాలా మంది టీకా తీసుకున్న తర్వాత శిశువులకు పాలివ్వకూడదనే అపోహలను కలిగిఉన్నారని, ఈ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని డా అనిత కున్నయ్య వెల్లడించారు. శిశువుకు జన్మనిచ్చినా, తల్లిపాలు ఇస్తున్న మహిళలు సాఫీగా టీకాలు వేసుకోవచ్చన్నారు. టీకాకు పాలివ్వడానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు.