సిటిబ్యూరోః మహిళ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సూరూర్‌నగర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన మహిళా సంరక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో భారీ ఎత్తున తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఇందులో అందరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సంరక్షణ, సైబర్ నేరాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి విషయం అన్నారు. దేశం మొత్తంలో నంబర్ వన్‌గా తెలంగాణ పోలీస్ నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతం అయింది అని, నేరాల శాతం కూడా తగ్గుముఖం పట్టింది అన్నారు.
మహిళా భద్రత కోసం షీ టీములు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్ళలో, బస్టాండు వంటి ప్రయాణ ప్రదేశాల్లో ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని అందుకే కొత్త రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ జోన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేశామిని తెలిపారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. మహిళా భద్రత కోసం షి టీములను ఏర్పాటు చేయశామని తెలిపారు. రోడ్లు, కళాశాలల్లో, పనిచేసే చోట ఎదురయ్యే వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుంచి ఎదురయ్యే వేధింపుల గురించి భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రాచకొండ పరిధిలో సైబర్ నేరాల నుంచి రక్షణకు కాల్ సెంటర్ నంబర్ 8712662662 ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ డిజిపి అంజని కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో సమానంగా రాచకొండ పోటీపడుతోందని అభినందించారు.
బహిరంగ లేదా ఆన్‌లైన్ ఈవ్ టీజింగ్/వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. షీ టీమ్ బృందాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన కల్పించేందుకు ఆడియో, -వీడియో వ్యాన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేధింపులపై బాలికలు, మహిళల భద్రతకు భరోసా ఇవ్వడానికి రాచకొండ కమిషనరేట్ కృషి చేస్తోందని అభినందించారు. నేర పరిశోధన వేగవంతం చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసామని, దాని ద్వారా రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలు అనుసంధానం చేయడబడతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరస్తులకు భయం పెరిగి నేరాల శాతం కూడా తగ్గుముఖం పట్టిందని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సమన్వయంతో ఎటువంటి నేరం అయినా ఒకే రోజులో నేరస్తులను పట్టుకునే స్థాయికి రాష్ట్ర పోలీసు శాఖ చేరుకుందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సైబర్ నేరాల శాతం పెరుగుతోందని తెలిపారు.
వివిధ రకాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని, కానీ అదే సమయంలో ప్రజలు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి వుండాలి అని పేర్కొన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగేలా యువత భాగస్వామ్యంతో కళాశాలలు, ఇతర ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎన్నో సైబర్ నేరాలు జరగకుండా అడ్డుకున్నామన్నారు. సోషల్ మీడియాలో యువతులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టబోమని హెచ్చరించారు. యువతులు సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు, మేసేజిలకు స్పందించకూడదని, ప్రొఫైల్ లాక్ ఖచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల నుండి ఎదురయ్యే వేధింపుల గురించి భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సూచించారు. నకిలీ లాటరీలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సుల వంటి పేరుతో ప్రజలను మోసం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని కమిషనర్ హెచ్చరించారు.
కార్యక్రమంలో రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన విభిన్న కార్యక్రమాల మీద రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు. కార్యక్రమంలో రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, సినీనటుడు ప్రియదర్శి, నటి ఫరియా అబ్దుల్లా, ఎల్ బినగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, డీసీపీ సైబర్ క్రైమ్స్ అనురాధ, డిసిపి రోడ్ సేఫ్టీ శ్రీబాల, డిసిపి జానకి, డిసిపి సాయిశ్రీ, అడ్మిన్ డిసిపి ఇందిర, డిసిపి మురళీధర్, డిసిపి గిరిధర్ ఐపిఎస్, డిసిపి ట్రాఫిక్ శ్రీనివాస్, ఎసిపిలు, ఇతర అధికారులు, Rksc జనరల్ సెక్రటరీ సతీష్ వడ్లమాని, కోశాధికారి గగన్ కోహ్లీ, సంయుక్త కార్యదర్శులు లతా సుబ్రహ్మణ్యం, అనిల్ రాచమళ్ళ, చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు
సైబరాబాద్‌లో మహిళా సంక్షేమ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సిపి స్టిఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు (W&CSW) విమెన్ అండ్ చైల్ & సేఫ్టీ వింగ్ డిసిపి నితికా పంత్, ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ నితికా పంత్ మాట్లాడుతూ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 200 మంది విద్యార్థులకు పోక్సో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అసభ్యంగా ప్రవర్తించడం,బాలమిత్ర తదితర అంశాల గురించి వివరించారు. పాఠశాలలో క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కెపిహెచ్‌బిలోని స్పైడర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన 500 మంది విద్యార్థులకు షీ టీమ్ అంటే ఏమిటి పనితీరు గురించి వివరించారు.
ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ఫోన్ కాల్ మరియు సోషల్ మీడియా ద్వారా వేధింపులు, బాల కార్మికులు, బాలల వేధింపులు, బాల్య వివాహాలు, స్త్మ్రల్ టీమ్ గురించి కూడా వివరించారు.మహిళల అక్రమ రవాణా, గృహ హింస, డయల్ 100, భరోసా కౌన్సెలింగ్ కేంద్రం, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత, అపరిచితుల నుండి పిల్లలకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. కెపిహెచ్‌బిలోని రిషీ విమెన్స్ కాలేజీకి చెందిన 300 మంది విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఫిషింగ్, పోర్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, ట్రోలింగ్, సైబర్ బ్లాక్‌మేయిల్, సైబర్ ఎక్స్‌టార్‌షన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షి టీమ్స్ ఇన్ స్పెక్టర్ సునీత, మాదాపూర్ ఎస్‌ఐ భవాని, కేపిహెచ్ బి ఎస్‌ఐ జైరాజ్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.