Wednesday, January 22, 2025

ముగిసిన జవహరి అధ్యాయం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: బిన్ లాడెన్ హతుడైన తర్వాత నుంచి అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న అల్ జవహరిని, అఫ్ఘానిస్తాన్‌లోని అతడి స్థావరంపై డ్రోన్ దాడి చేసి అమెరికా హతమార్చింది. ప్రపంచ టెర్రరిస్ట్ నేతల్లో అగ్రగణ్యుడైన జవహరి హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వ ఘన విజయంగా చాటుకొన్నారు. అమెరికాకు హాని తలపెట్టే వారందరికీ చెబుతున్నాను, వినండి, మేమెప్పుడూ అప్రమత్తంగా ఉంటాం, స్వదేశంలో, ప్రపంచమంతటా గల అమెరికన్ల రక్షణ, భద్రతలకు హామీ ఇస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం’ అని బైడెన్ సోమవారం నాడు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్ర దేశాలపై దాడులు చేయాలని జవహరి తన అనుచరులకు ఇటీవల విజ్ఞప్తి చేసినట్టు వైట్ హౌస్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేసింది.

అల్ జవహరిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ఒక భవనం బాల్కనీలో ఉండగా తమ దళాలు డ్రోన్ దాడి చేసి చంపేశాయని వైట్ హౌస్ వర్గాలు తెలియజేశాయి. ఈ ఘటనలో ఒక్క అమెరికన్ సైనికుడి పాదముద్ర కూడా అక్కడి నేల మీద పడలేదని, అలాగే ఇతరులెవ్వరికీ ప్రాణహాని కలుగలేదని వెల్లడించాయి. జవహరిని కాబూల్‌ల్లో ఉండడానికి అనుమతించడం దోహా ఒప్పందానికి ఉల్లంఘన అని వైట్ హౌస్ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అఫ్ఘాన్‌లో టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరాదన్న షరతు మీదనే అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు అంగీకరిస్తూ తాలిబాన్లతో 2020లో దోహలో ఒప్పందం కుదిరిందని ఆ అధికారి వెల్లడించారు. అదే ఏడాది అధ్యక్ష పదవి ఎన్నికల్లో బైడెన్ ప్రచారం చేస్తూ ఇరాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖాసిమ్ సొలేమనీని హత్య చేయించినందుకు అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తప్పుపట్టారు.

ఇప్పుడు బైడెన్ కూడా అదే పని చేశారు. దక్షిణాసియా అంతటా అమెరికా సైనికులపై దాడులకు బాధ్యుడని భావించి సొలేమనీని ట్రంప్ ఇరాక్‌లో చంపించారు. ఆ చర్య వల్ల ఇరాన్‌తో యుద్ధం ముంచుకు రాగలదని బైడెన్ అప్పుడు హెచ్చరించారు. అమెరికన్ సైనికులు ఇతర దేశాల్లో ప్రాణ త్యాగం చేయవలసిన పరిస్థితి రానీయరాదని అమెరికా తీర్మానం చెప్పుకోడం, అందుకనుగుణంగా అన్ని యుద్ధ క్షేత్రాల నుంచి సైనికులను ఉపసంహరించుకోడం జరిగింది. ప్రస్తుతం ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో కూడా అమెరికా ప్రత్యక్షంగా సైన్యాన్ని పంపించకుండా ఉక్రెయిన్‌కు భారీ ఆయుధ సాయం చేస్తున్నది. కాబూల్ లో జవహరి హత్య అల్ ఖైదాను రెచ్చగొట్టడం ఖాయం. నాయకుడిని కోల్పోయిన ఆ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా పోతుందో, పగతో మరింత బలపడుతుందో చూడాలి. 2021 ఆగస్టు 31న హడావుడిగా అఫ్ఘాన్‌ను అమెరికా సేనలు విడిచిపెట్టిన తర్వాత అమెరికా బయటి దేశంలో సైనిక దాడికి పాల్పడడం ఇదే తొలిసారి.

త్వరలో అమెరికన్ పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో తన పార్టీని నెగ్గించుకోడానికి తురుఫు ముక్కగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే బైడెన్ ఈ దాడి జరిపించారు. వాస్తవానికి ఆయన అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత అమెరికా ప్రజల్లో ఆయన ప్రతిష్ఠ పెరగకపోగా మసకబారిందనే అభిప్రాయం ఏర్పడింది. ఇంతకాలం రహస్యంగా ఉన్న జవహరి ఉనికి ఇప్పుడు అమెరికన్లకు ఇంత గురి తప్పకుండా ఎలా తెలిసిందనేది ముఖ్యమైన ప్రశ్న. కైరోలో డాక్టర్‌గా చేస్తూ 1980లో అఫ్ఘాన్ చేరుకొని జిహాదీ టెర్రరిస్టుల్లో చేరిన జవహరి అమెరికాతో ఢీ కొనే వ్యూహ రచనలో దిట్ట అనిపించుకున్నాడు. బిన్ లాడెన్ కుడి భుజంగా 2001, సెప్టెంబర్ 11న అమెరికన్ జంట ప్రాసాదాలపై జరిగిన దారుణాతి దారుణ దాడిలో జవహరి కీలక పాత్ర పోషించాడని భావిస్తారు. పట్టపగలు విమానాలను పేల్చడం ద్వారా జరిపిన ఆ ఆత్మాహుతి దాడిలో 3000 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లోకెల్లా బలమైనది అల్ ఖైదా, జవహరి నాయకత్వంలో హింసోన్మత్తతలో ఆరితేరిందని చెబుతారు.

భారత దేశంలో కూడా వ్యాపించిందని ఇక్కడి నుంచి కొద్ది మందిని రిక్రూట్ చేసుకొన్నదని సమాచారం. ముఖ్యంగా 2011 నాటి అరబ్ స్ప్రింగ్ తిరుగుబాట్లు బలపడి వామపక్ష భావజాలం వైపు మొగ్గకుండా చూసి ఆ శక్తులను అల్ ఖైదా వైపు జవహరి మళ్లించాడని సమాచారం. పాకిస్థాన్‌లో బిన్ లాడెన్ స్థావరం మీద అమెరికన్ సైన్యం దాడి చేసి అతడిని చంపేసిన తర్వాత జవహరి అల్‌ఖైదా అధినేత అయ్యాడు. శత్రు శేషాన్ని ఉంచరాదనే దృష్టితో జవహరిని అమెరికా ఇప్పుడు మట్టుబెట్టింది. అయితే నిజంగానే అమెరికా శత్రు నిశ్శేషం అవుతుందా? లేక దానికి, మన వంటి దేశాలకు ఉగ్రవాద భయం పెరుగుతుందా? జవహరి ఆచూకీని అఫ్ఘాన్ ప్రభుత్వమే తెలియజేసి ఉంటే వేరు మాట. లేకపోతే తాలిబాన్ పాలకులు అల్ ఖైదాకు ఆశ్రయం ఇస్తున్నారని రూఢిగా భావించక తప్పదు. ఇది అమెరికాకే కాకుండా ఇండియాకు కూడా ఉగ్రదాడుల భయాన్ని పెంచుతుంది. సంహారం ఒక్కటే అంతర్జాతీయ ఉగ్రవాదానికి పరిష్కారం చూపదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News