అయోధ్య: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడంపై రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నాయకులుకొందరు వెనుకడుగు వేసినప్పటికీ దేశంలో అత్యంత ప్రతిష్టాకరంగా, స్టేటస్ సంబల్‌గా అయోధ్య ఆహ్వాన పత్రిక ప్రస్తుతం మారిపోయింది. ఒకప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి ఇదర్శనంగా, అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న అయోధ్య పట్టణ రూపురేఖలే ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఈ నెల 22న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనేందుకు దేశంలోని రాజకీయ, సినీ, ఆధ్తాత్మిక్క, పారిశ్రామికలతోసహా వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు వస్తున్న వేళ పట్టణం ఆర్థికంగా కూడా పురోభివృద్ధి దిశలో పయనిస్తోంది.
రానున్న రోజుల్లో దేశనలుమూలలకు చెందిన భక్తులే కాక విదేశాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు అయోధ్య క్షేత్రాన్ని సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే..ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పిలిచే అతిథుల జాబితాను అత్యంత జాగ్రత్తగా మరీ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, ప్రభాస్ తదితర సినీ ప్రముఖులు, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని వంటి స్టార్ క్రికెటర్లు, వివిధ మఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్మాత్మిక గురువులతోపాటు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరవుతున్న ఈ మహోత్సవంలో పాల్గొనడం ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది.
ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడమంటే తాము కూడా ప్రముఖుల కోవలోకి వస్తామన్న భావన పలువురిలో నెలకొంది. ఆతిథుల జాబితాలో చోటు దక్కాలంటే బిజెపి ఆమోదముద్ర కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడడంతో ఆహ్వానాల ప్రాముఖ్యం మరింత పెరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ విదేశాలకు చెందిన సంపన్నులు, పలుకుబడిగల ప్రముఖులు తమ సొంత లేదా అద్దె విమానాలలో అయోధ్యకు చేరుకోనున్న తరుణంలో అయోధ్యతోపాటు సమీపంలోని వారణాసి, గోరఖ్‌పూర్‌లోని విమానాశ్రయాలలో సైతం పార్కింగ్ ప్రదేశాలు ఫుల్ అయిపోయినట్లు తెలిసింది. జనవరి 22న అయోధ్య విమానాశ్రయానికి దాదాపు 100 ప్రైవేట్ విమానాలు చేరుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అయోధ్యలో దివ్య, భవ్య మంతిరాన్ని నిర్మిస్తామన్నది బిజెపి ప్రధాన ఎన్నికల ప్రచారం కావడంతో మాట నిలబెట్టుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, శోభాయమానంగా నిర్వహించాలని ఆ పార్టీ సంకల్పించింది. గతంలో ఇరుకు వీధులు, గతుకుల రోడ్లు, రోడ్లపైనే ప్రవహించే మురుగునీరుతో పాలకుల అలక్ష్యాన్ని ఎదుర్కొన్న అయోధ్యలో ఇప్పుడు తళతళ మెరిసే రోడ్లు, శుభ్రమైన వీధులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుద్దీపాలంకరణతో కళకళలాడుతూ పట్టణం దర్శనమిస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్య పట్టణంలో కొంత స్థలం కొనుగోలు చేశారంటే పట్టణంలో స్థిరాస్తి వ్యాపారం ఎంత జోరుగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 10,000 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మడంచెల భద్రతా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆలయ పరిసరాలను సిఆర్‌పిఎఫ్, పిఎసి, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు రాత్రీపగలూ పహరా కాస్తున్నారు. ఆలయ సముదాయం చుట్టూ ఎన్‌ఎస్‌జి, ఎస్‌ఎస్‌ఎఫ్ కమాండోలు మోహరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం రామ జన్మభూమి ఆలయాన్ని సందర్వించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భద్రతతోసహా ఇతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున భక్తులు పాదరక్షలు లేకుండా అయోధ్యకు రావద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. అయోధ్యను సందర్శించాలని భావిస్తున్న భక్తులు కొంతకాలం ఓపిక పట్టాలని ఆయన సూచించారు.