తన తీవ్ర చర్యకు పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ
అయోధ్య: ఓ 28 ఏళ్ల పూజారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నరసింహ మందిరానికి చెందిన రామ్ శంకర్ దాస్ ఆత్మహత్య చేసుకున్నది ఫేస్‌బుక్‌లో లైవ్ అయింది. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ తీవ్ర చర్య తీసుకున్నట్లు అతడు తెలిపాడు.
పోలీసులు ఐదు రోజుల క్రితం రామ్ శంకర్ దాస్ మీద కేసు నమోదు చేశారు. గుడికి మహంత్‌గా ఉన్న ఆయన అన్న రామ్ శరణ్ దాస్(80) ఈ ఏడాది జనవరి నుంచి కనిపించడం లేదన్న కారణంగా కేసును నమోదు చేశారు. మందిరం ఆవరణలో ఉన్న ఆయన గదిలో సోమవారం మధ్యాహ్నం ఉరేసుకున్న రామ్ శంకర్ దాస్(28) దేహం వేలాడుతూ కనిపించింది. లైవ్ వీడియోలో రామ్ శంకర్ దాస్ రాయ్‌గంజ్ పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జీపైన, తన భద్రతకు ఏర్పాటుచేసిన కానిస్టేబుల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
కొత్వాలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ శర్మ ‘పూజారి రామ్ శంకర్ దాస్ మత్తుకు అలవాటు పడ్డాడు. మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులపై అతడు చేసిన ఆరోపణలన్ని పూర్తిగా అవాస్తవాలు’ అన్నారు. ఈ కేసును అన్ని విధాల దర్యాప్తు చేయడం మొదలయిందన్నారు.