Thursday, December 26, 2024

అయోధ్య నగరం…. రామభక్త సాగరం

- Advertisement -
- Advertisement -

భారీగా ఏర్పాట్లు చేసిన యుపి ప్రభుత్వం
క్రతువు కోసం అయోధ్య రామమందిరం తీర్థ క్షేత్రం ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఎటు చూసినా రామనామ స్మరణలే..
రంగురంగుల పూలు.. విద్యుత్ దీపాలతో జిగేల్‌మంటున్న రామజన్మస్థలి

ప్రధాని మోడీ సహా దేశ విదేశాల నుంచి ప్రముఖుల రాక

మన తెలంగాణ/అయోధ్య నుంచి నారాయణ మల్లేష్ : రాముడి జన్మస్థలం అయోధ్య ఓ మహోన్నత ఘట్టానికి సిద్ధమైంది. హిందువులంతా వందల సంవత్సరాలుగా కంటున్న కల సాకారమయ్యే గడియ వచ్చేసింది. సోమవారం ఉదయం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అయోధ్య అంతటా రామనామ సంకీర్తనలతో మారుమోగుతోంది. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం… కల నిజమవుతుందన్న ఉద్విగ్నత..ఆనందం నిండిన మోము తో అయోధ్యవాసులు పులకరించిపోతున్నారు. నగరం మొత్తం శ్రీరాముడి కటౌట్లు, బ్యానర్లతో కాషాయమయం గా మారింది.

దేశ విదేశాల నుండి భక్తులు భారీ సంఖ్య లో అయోధ్యకు తరలివస్తున్నారు. వయసు, వృద్ధాప్యం, అంగవైకల్యం లెక్క చేయకుండా రామభక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. కొందరు వేల కిలోమీటర్లు కాలి నడకన, మరి కొందరు మోకాళ్లపై సైతం నడిచి వచ్చి రామయ్యపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. కాలినడకన అయోధ్యకు వస్తున్న భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. దారి పొడవునా వైద్య సేవ లు, ఆహార ఏర్పాట్లతో పాటు వారికి సహాయం చేయాలంటూ రాష్ట ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరో వైపు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన మహోత్తర కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు విదేశీ మీడియా సైతం అయోధ్యకు చేరుకుంది. మీడియా ప్రతినిధుల కోసం అయోధ్య ట్రస్ట్ ప్రత్యేక మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మీడియాకి కావాల్సిన ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఆహార ఏర్పాట్లను భారీగా ఏర్పాటు చేశారు.

ఆకట్టుకుంటున్న అలంకరణలు…

ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. సోమవారం ఉదయం బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. -ఇక రామమందిరం ఫొటో ముద్రించిన విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, క్యాలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు… ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు ప్రతిచోటా రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి.

ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేక ఏర్పాట్లు…

అయోధ్య రామ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించవచ్చు. అయితే ఏ ఛానెల్లో లైవ్ ప్రసారం జరుగుతుంది.

ఇక్కడే లైవ్…

మీరు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూడడానికి అయోధ్యకు వెళ్లలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డీడీ న్యూస్, దూరదర్శన్ జాతీయ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇది కాకుండా ప్రత్యక్ష ప్రసారాన్ని డీడీ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీక్షించవచ్చు. డీడీ న్యూస్ అయోధ్యలోని పలు ప్రాంతాల్లో 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 8 సెకన్ల నుంచి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొత్తం వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఆలయం విశేషాలివీ…

నాగార శైలిలో రామ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది. ఆలయ సముదాయం మొత్తం 57 ఎకరాలు. అందులో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించబడింది. ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఎత్తు 161 అడుగులు. ఆలయంలో 5 మంటపాలు, 318 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం 14.6 అడుగులు. ఆలయ పనులు 55 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2024 చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ అంటే గర్భగుడి సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తు కూడా దాదాపు 80 శాతం పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News