Friday, December 20, 2024

అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ

- Advertisement -
- Advertisement -

అయోధ్య : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ ఉత్సవానికి ఆహ్వానితులు నగరంలోకి రాసాగారు. ఒకప్పుడు ఏమాత్రం హడావిడి లేని నగరం ఇప్పుడు కొత్త మౌలిక వసతులు, ఆధ్యాతికతతో వెల్లివిరుస్తోంది. భారత్‌లో రాజకీయ, మత చరిత్రలో ముఖ్యమైన రామ్ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం జరగనున్నది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు పశ్చిమంగా దాదాపు 140 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయోధ్య నగరాన్ని బహుళ వర్ణాల పుష్పాలతో అలంకరించారు. రామ్ ధున్ రికార్డింగ్‌లు లౌడ్‌స్పీకర్ల ద్వారా వినిపిస్తున్నాయి.

శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషాలతో నగర ప్రజలు వీధుల్లో ఊరేగింపుగా సాగుతున్నారు. మరొక పక్క భక్తులు, వార్తా కెమెరా సిబ్బంది వారిని అనుసరించసాగారు. నగరంలోని ప్రధాన రహదారి రామ్ పథ్‌లో ఒక దుస్తుల దుకాణ యజమాని అయిన శైలేంద్ర గుప్తా ‘అయోధ్య రామ్ మయే హో గయీ హై (శ్రీరాముని పట్ల భక్తిలో అయోధ్య నిమగ్నమైంది’ అని అన్నారు. ‘సోమవారం ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆనందంతో గంతులు వేసే రోజు’ అని ఆయన అన్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు బాధ్యతతో విధులు నిర్వహిస్తూ కార్లను ముందుకు సాగవలసిందిగా కోరుతున్నారు. అయితే, రామ్ పథ్‌పై భక్త జన సందోహాన్ని తప్పించుకు వెళ్లేందుకు కార్ల డ్రైవర్లు పదే పదే హారన్‌లు మోగించవలసి వస్తోంది. భక్తులలో చాలా మంది తమ నుదుట ‘జై శ్రీరామ్’ నినాదం రాయించుకున్నారు.

The face of the statue of Lord Ram in Ayodhya

‘సమస్త దేశం శ్రీరాముని నామాన్ని ఉచ్చరిస్తోంది’ అని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ఈ ఉత్సుకత అంతా సోమవారం జరగనున్న భారీ ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు సన్నాహంగా కానవస్తోంది. ఆలయ ప్రదేశంలో 16వ శతాబ్దంలో నిర్మితమైన బాబ్రీ మసీదు ఉండేది. 1992 డిసెంబర్ 6న కర సేవకులు మసీదును కూల్చివేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీం కోర్టు ఆలయం నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు దరిమిలా అయోధ్యలో మౌలిక వసతుల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నగరంలో ఇప్పుడు విశాలమైన ప్రధాన రహదారులు, ఫ్లై ఓవర్లు, సరికొత్త విమానాశ్రయం, పునర్నిర్మిత రైల్వే స్టేషన్ ఉన్నాయి. అయోధ్యవీధులను కాషాయ పతాకాలతో అలంకరించారు. శ్రీరామునితో పాటు రామ్ మందిర్ కటౌట్లను లతా మంగేష్కర్ చౌక్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా, భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు.

Ram Lalla statue in Ayodhya

ఒక రోజు తరువాత ఆలయాన్ని ప్రజల దర్శనం కోసం తెరుస్తారు. ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై ఒంటి గంటకు పరిసమాప్తం కావచ్చు. అటుపిమ్మట ప్రధాని మోడీ సంత్‌లు, ప్రముఖ వ్యక్తులతో సహా ఏడు వేల మందికిపైగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ మొత్తం కార్యక్రమాన్ని దేశ, విదేశాలలోని కోట్లాది మంది ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానితులలై ఒకరైన రాజస్థాన్ ఆల్వార్లోని పురాతన ప్రార్థనా మందిరం మహంత్ ప్రకాశ్ దాస్ మహారాజ్ ‘అయోధ్యకు వెండి పాదుకల జత తెచ్చాను. వాటిని రామ్ ఆలయం ట్రస్ట్ చైర్మన్‌కు అందజేయనున్నాను. వాటి బరువు 750 గ్రాములు. ఆల్వార్‌లోని కళాకారులు వాటిని తయారు చేశారు’ అని తెలియజేశారు. కాగా, ‘ఇంత భారీ స్థాయిలో జనం పాల్గొంటారని మేము ఊహించలేదు. తుదకు దేశంలోని అగ్రశ్రేణి పౌరులు కూడా ఈ వేడుకకు ఆహ్వానాన్ని కోరుతున్నారు’ అని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News