న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠతో ఐదు శతాబ్దాల నిరీక్షణ, కల సోమవారం సఫలం అయ్యాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ క్షణం కోసం నిరీక్షిస్తూ అనేక తరాలవారు ఎన్నో త్యాగాలు చేశారని, శ్రీ రామ జన్మభూమిలో తిరిగి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పాన్ని ఏ ‘భయమూ, బెదరింపూ’ అడ్డుకోజాలవని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ సంకల్పం నెరవేరిందని, ఇందుకు తాను మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అమిత్ షా ‘ఎక్స్’లో ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘ఈ శుభ సందర్భంలో శతాబ్దాల తరబడి ఈ ఉద్యమాన్ని, దృఢనిశ్చయాన్ని కొనసాగించిన, పెక్కు అవమానాలను. చిత్రవధలను సహించిన, ధర్మ పథాన్ని వీడని మహామహులు అందరినీ నేను గౌరవిస్తున్నాను’ అని మంత్రి తెలిపారు.
‘విశ్వ హిందూ పరిషత్, వేలాది మంది మహా సాధువులు, అసంఖ్యాక ప్రముఖ, సాధారణ వ్యక్తుల ఉద్యమం వల్ల ఈరోజు ఆనందకర, విజయవంతమైన ఫలితం వచ్చింది’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలోని బిర్లా మందిర్‌లో సోమవారం పూజ జరిపారు. భారీ శ్రీ రామ జన్మభూమి ఆలయం ఏళ్ల తరబడి ‘చెక్కుచెదరని శాశ్వత సంస్కృతికి విశిష్ఠ చిహ్నంగా కొనసాగుతుందని అమిత్ షా అన్నారు. ‘ఐదు శతాబ్దాల నిరీక్షణ, కల ఈ రోజు సాఫల్యమైంది. ఈ రోజు కోట్లాది మంది రామ భక్తులకు చిరస్మరణీయ దినం. ఈ రోజు మన రామ్ లలాల తన బృహత్ ఆలయంలో ఆశీనుడైనప్పుడు అసంఖ్యాక రామ భక్తుల వలె నేనూ భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. మాటల్లో వ్యక్తీకరించలేని అనుభూతి ఇది’ అని అమిత్ షా అన్నారు. అయోధ్య ఆలయంలో కొత్త రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సోమవారం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ ఇళ్లలో, ఆలయాల్లో టెలివిజన్‌లో వీక్షించారు.