Monday, December 23, 2024

అందరివాడు అయోధ్య రాముడు

- Advertisement -
- Advertisement -

అవును శ్రీరాముడు అందరి వాడు… ఆయన అందరికీ బంధువు… జగదేక వీరుడు… ఆయనది జగమంత కుటుంబం…. రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది… ఆయన కోసం తపిస్తోంది. అయోధ్య నుండి దర్శనం ఇవ్వనున్న బాల చంద్రుడి దర్శనం కొరకు ఆసేతు హిమాచలం అమితానందంతో ఎదురు చూస్తోంది. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో ఆవిష్కృతం కానున్న శ్రీరాముని ఆలయ ఆరంభ ఘట్టం ఓ అద్భుతం. భారతీయుడి కల సాకరమైన వేళ… ఈ రోజు కోసం శతాబ్దాలుగా రామదండు ఎదురు చూసింది. ఈ క్రమంలో ఎన్నో పరిణామాలు… రామ మందిరానికై జరిగిన రాజీలేని పోరాటంలో ఎందరో భక్తులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. రామ జన్మభూమికై దేశ వ్యాప్తంగా ఆయా దశల్లో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని నేటి విజయానికి బాటలు వేశారు.

చరిత్రలోకి వెళ్తే…
ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఓ ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో వుంది. భారత దేశంలోని అతి పురాతన పట్టణాల్లో అయోధ్య ఒకటి. శ్రీరాముడిగా సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతరించిన ప్రదేశం. రామాయణ మహాకావ్యం ఆవిష్కరణకు మూలం అయోధ్య. 1528లో మొఘల్‌లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఫలితంగా రాముడు పుట్టిన ప్రాంతం వారి ఆధీనంలోకి వెళ్ళింది. అయోధ్య నగరంలో వున్న రామ మందిరాన్ని భూస్థాపితం చేసి దాని స్థానే మసీద్‌ను అక్రమంగా నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. మొఘల్ జనరల్ మీర్ బాకీ మసీద్‌ను నిర్మించి మొఘల్ చక్రవర్తి బాబర్‌కు అంకితం ఇవ్వడంతో అదే బాబ్రీ మసీదుగా పిలువబడేది.

సంఘ్ పరివార్ ఉద్యమం
1980 దశకంలో విశ్వహిందూ పరిషత్ దాని అనుబంధ సంఘ్ పరివార్ సంస్థలు రామజన్మ భూమికై ఆందోళనకు తీవ్రతరం చేశాయి. మసీద్‌ను నేల మట్టం చేసి మందిరం నిర్మించి తీరాలన్నది వీరి సంకల్పం.
1990వ సంవత్సరంలో ఆందోళన పతాక స్థాయికి చేరింది. ఆ ఏడాది సెప్టెంబర్,- అక్టోబర్ నెలల్లో సాగిన రథయాత్ర ఉద్యమాన్ని దేశ నలుదిశలూ మార్మోగేలా చేసింది. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర కు నాయకత్వం వహించారు. మహోగ్రంగా సాగిన రథయాత్రకు అద్వానీ సారథి కాగా, సంఘ్ పరివార్ వారధిగా నిలిచింది. ఈ యాత్ర భారత దేశ చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగినదిగా గుర్తుండిపోయింది. గుజరాత్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సోమనాథ్ నుండి ప్రారంభమై వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతూ అయోధ్య చేరుకునేలా రూపొందించిన వ్యూహం అలనాడు కేంద్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.

రోజుకు 300 కిలోమీటర్లు సగటున గుజరాత్‌లో రథయాత్ర సాగింది. ఆ రాష్ట్రంలో సుమారు 600 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. 50 ర్యాలీలు నిర్వహించగా గుజరాత్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.యాత్రలో అద్వానీ ప్రసంగాలు హిందూ జాతీయతా ఇతివృత్తాలను ప్రస్తావిస్తూ హైందవ సమాజాన్ని తట్టి లేపాయి. గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మతపరమైన అల్లర్లు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పింది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అప్పటి విపి సింగ్ ప్రభుత్వానికి ఈ పరిణామం జీవన్మరణ సమస్యగా మారింది. అద్వానీ అరెస్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయించారు. ముఖ్యంగా రాముడికీ, బాబర్‌కూ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో అద్వానీ ఘన విజయం సాధించారు మరీ ముఖ్యంగా నేడు భారతీయ జనతా పార్టీ అప్రహతిహతంగా వెలిగేందుకు ఆయన ప్రత్యక్ష కారకుడు.

అద్వానీ అరెస్టు…
అయోధ్యలో కరసేవకు అద్వానీ చేరుకునే అవకాశం లేకుండా అక్టోబర్ 23న బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అద్వానీని అరెస్ట్ చేసినప్పటికీ కరసేవకులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రైళ్లలో టిక్కెట్లు కొనుక్కొని మరీ అయోధ్య తరలి వెళ్ళారు. సుమారు లక్షన్నర మంది కర సేవకులు ఆయా ప్రాంతాల్లో అరెస్టు అయ్యారు. అక్టోబర్ 30వ తేదీన దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఆంక్షలను అధిగమించి అయోధ్య చేరుకొని బాబ్రీ మసీదును చుట్టిముట్టారు. అక్కడ సుమారు 20 వేల మంది భద్రత దళాలున్నాయి. కరసేవకులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలను అధిగమించి ఓ కార్యకర్త బాబ్రీ మసీదుపైకి ఎక్కి కాషాయం జెండా ఎగురవేశాడు. వెనువెంటనే వేల సంఖ్యలో కరసేవకులు గొడ్డళ్ళు, పలుగులు ఇతర ఆయుధాలతో మసీద్‌ను కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు తొలుత భాష్ప వాయువును ప్రయోగించి తర్వాత తుపాకులతో కాల్పులు జరిపాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ రణరంగంలో సుమారు 20 మంది కర సేవకులు జై శ్రీరామ్… జై శ్రీరామ్ అని నినదిస్తూ నేలకొరిగారు.

ఆంధ్రప్రదేశ్‌లో…
రామ శిలా పూజల సమయంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అద్వానీ రథయాత్ర నేపథ్యంలో ఊరూరూ రామ శిలా పూజలు నిర్వహించడం విశేషం. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామం నుండి ఇటుకలను సేకరించి, వాటిన ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో పూజించి, కరసేవలో భాగంగా అయోధ్యకు చేర్చి రామ మందిరం నిర్మాణానికి ఇవ్వాలనేది ఓ సంకల్పం. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News