Saturday, November 23, 2024

అయోధ్యలో 10 ఎకరాలలో ఆలయ మ్యూజియం: యోగి సర్కార్ ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

అయోధ్య: దేశంలోని వివిధ ఆలయాల విశిష్టతను, చరిత్రను, వైభవాన్ని ప్రజలకు వివరించేందుకు ఒక ఆలయ ప్రదర్శనశాలను(టెంపుల్ మ్యూజియం) ఏర్పాటు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ ప్రదేశాలలో వెలసిన ప్రముఖ ఆలయాలను ఒకేచోట సందర్శకులు తిలకించే విధంగా నిర్మించే ఈ ఆలయ మ్యూజియంకు సంబంధించిన బ్లూప్రింట్ తయారీలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైనట్లు అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాళ్ శనివారం వెల్లడించారు.

ఈ ప్రణాళికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వివరించామని, 10 ఎకరాల స్థలంలో ఈ ఆలయ మ్యూజియం ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని ఇంకా ఎంపిక చేయవలసి ఉందని ఆయన తెలిపారు. హిందూ మతం, హిందూ ఆలయాల విశిష్టత, సనాతన ధర్మం గురంచి యువజనులలో చైతన్యం తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.

వివిధ ప్రముఖ ఆలయాల నిర్మాణ శైలి, కట్టడాల ప్రత్యేకతవంటి అనేక అంశాలను వివరించేందుకు వేర్వేరు గ్యాలరీలు ఈ మ్యూజియంలో ఉంటాయని దయాళ్ తెలిపారు. ఫోటోలు, కుడ్య చిత్రాల ద్వారా వివిధ ప్రముఖ ఆలయాల విశిష్టతను, నిర్మాణ శైలిని ప్రతిపాదిత మ్జూయంలోని గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచుతామని ఆయన చెప్పారు. నిపుణుల వ్యాఖ్యానాలతో లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఇందులో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో పర్యాటక శాఖ మూజియం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తోందని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్ తెలిపారు. ఆలయ మ్యూజియం సముదాయంలో ఉద్యానవనం, కేఫ్‌టీరియా, బేస్‌మెంట్ పార్కింగ్ ఉంటాయని ఆయన వివరించారు.

అయోధ్యలో దాదాపు 6,000 ఆలయాలు ఉన్నాయని, సాధారణ రోజులలో రోజుకు 3 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారని ఆయన తెలిపారు. సంక్రాంతి, శ్రీరామ నవమి, జులై, ఆగస్టులో జరిగే సావన్ ఝూలా ఉత్సవం, చౌదా కోశి పరిక్రమ, పంచ్ కోశి పరిక్రమ, దీపావళి వంటి పండుగ రోజులలో పర్యాటకుల సంఖ్య 10 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.

అయోధ్యలోని రామాలయం వచ్చే ఏడాది జనవరిలో భక్తుల సందర్శనార్థం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News