Saturday, December 28, 2024

రానున్న రోజుల్లో భక్తజన సంద్రంగా అయోధ్య

- Advertisement -
- Advertisement -

రోజుకు 3 లక్షల మంది వచ్చే అవకాశం
రద్దీకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన

న్యూఢిల్లీ: రానున్న రోజులలో అయోధ్యను ప్రతి నిత్యం మూడు లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని, ఇందు కోసం దేశంలోని తిరుపతి, అమృత్‌సర్ వంటి క్షేత్రాలతోపాటు వాటికన్ సిటీ, కాంబోడియా, జెరుసలెం తదితర ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలను అధ్యయనం చేసి అయోధ్య పట్టణ ప్రణాళికను రూపొందించినట్లు అయోధ్య రామాలయ ప్రాజెక్టు మాస్టర్ ప్లానర్ దీక్షు కుక్రేజా వెల్లడించారు. గరిష్ఠస్థాయిలో లభ్యతలో ఉన్న భూమిని ఉపయోగించుకోవడం, కనిష్ఠ స్థాయిలో రద్దీ ఉండేలా చూడడం, ధర్మశాలలు, హోమ్‌స్టేలకు ప్రాధాన్యత ఇవ్వడం, నగర చారిత్రకత్కృతిక స్వరూపాన్ని మార్చకుండా మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి దీక్షు కుక్రేజా రూపొందించిన పట్టణ ప్రణాళికలోని ప్రత్యేకాంశాలు.

రానున్న రోజులలో అయోధ్య నగరం ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారనున్నదని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ సంపద వంటి అంశాలపై ప్రధానంగా ప్రజల దృష్టి ఆలయోధ్యపై ప్రసరించనున్నదని సిపి కుక్రేజా ఆర్కిటెక్ట్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ దీక్షు కుక్రేజా తెలిపారు. ఆతిథ్య, సంబంధిత పరిశ్రమలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనున్నదని ఆయన అన్నారు. నగరాన్ని పర్యాటకంగా, ఆర్థికంగా, మతపరమైన కార్యకలాపాల పరంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ఆలోచనగా ఆయన తెలిపారు. రానున్న మూడేళ్లలో రోజుకు 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. పెరగనున్న నగర జనాభాను, పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారికి అవసరాలకు అనుగుణంగా రోడ్లు, వంతెనలు, మురుగునీటి పారుదల వ్యవస్థ వంటి ఆధునిక సౌకర్యాలను రపొందించినట్లు ఆయన తెలిపారు.

అయితే నగర చారిత్రక, సాంస్కృతిక స్వరూపం విషయంలో ఎటువంటి రాజీ పడలేదని ఆయన స్పష్టం చేశారు. అయోధ్యలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండేలా పట్టణ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన చెప్పారు. దేశ విదేశాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నగరాలను అధ్యయనం చేసి అక్కడ పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకోవడం ద్వారా అయోధ్య పట్టణ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించినట్లు గతంలో ఢిల్లీలో ఏరోసిటీ, ద్వారకలో ఇండి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని డిజైన్ చేసిన దీక్షు తెలిపారు. అయోధ్య రామాలయ తొలి దశ పూర్తి కానున్నది.

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అయోధ్య నగరాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టు పూర్తి కావడానికి పదేళ్లకు పైగా సమయం పడుతుంది. దీని అంచనా వ్యయం రూ. 85,000 కోట్లు. అయోధ్య మాస్టర్ ప్లాన్ అమలు తొలి దశలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు దీక్షు చెప్పారు. ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారాలంటే అనుసంధానం(కనెక్టివిటీ) అత్యంత ముఖ్యమని ఆయన చెప్పారు. డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు వల్ల ఆశించిన ప్రయోజనం లభించదన్న ఉద్దేశంతోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌ను ఇప్పటికీ ప్రారంభించడం జరిగిందని ఆయన వివరించారు. అయోధ్య నగరంలో ప్రవేశించే మార్గాల వ్రద్ద సాంప్రదాయ శిలా తోరణాల రూపంలో రామ ద్వారాలను నిర్మించినట్లు ఆయన చెప్పారు.

నగరాన్ని సందర్వించే భక్తులు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా తాదాత్మం చెందే రీతిలో రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని అభివృద్ధి చేసినట్లు దీక్షు వెల్లడించారు. అయోధ్య వైభవాన్ని ప్రతిబింబించే విధంగా ద్రవిడ ఆలయ వాస్తు శిల్ప శైలిలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకే కాక నగరంలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. పర్యాటకుల తాకిడి పెరిగే కొద్దీ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగకుండా నివారించే ఉద్దేశంతో నగరంలోకి ప్రవేశించే పర్యాటకుల వాహనాలు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిలుపుకుని అక్కడ నుంచి అయోధ్యలోపల ఎలెక్ట్రిక్ వాహనాలలో ప్రయాణించే విధంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News