న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మాణమవుతున్న రామాలయంలోకి 2023 డిసెంబర్ వరకల్లా భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. అప్పటివరకల్లా గర్భగృహ నిర్మాణం పూర్తి అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పూర్తి నిర్మాణం జరగడానికి 2025 వరకు సమయం పడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్స్, పరిశోధనా కేంద్రం కూడా రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
రామాలయం నిర్మాణంపై దశాబ్దాల క్రితమే తమ పార్టీ(బిజెపి) ఇచ్చిన హామీమేరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్టు భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆలయంలోకి భక్తులకు అనుమతించడం ద్వారా లబ్ధి పొందాలన్న వ్యూహం కూడా ఆ పార్టీకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక నిర్మాణంలో ఉన్న రామ్‌లల్లా, సీత, లక్ష్మణుడి విగ్రహాలను గర్భగృహం నిర్మాణం పూర్తి కాగానే అక్కడికి తరలించనున్నారు. గర్భగృహం వద్దకు భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వడం ద్వారా రామున్ని ఆరాధించే హిందువుల మన్ననలు పొందాలన్నది బిజెపి వ్యూహంగా భావిస్తున్నారు.