విజయ దశమి రోజున అమ్మవారు మహిషాసురుడిని అంతం చేస్తుంది. దుష్టులను శిక్షించడంతో పాటు మంచి వారిని శక్తిస్వరూపిణి అమ్మవారు కాపాడుతారు. అమ్మవారి నామాన్ని తలచి, మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠించినంతనే అరిష్టాలు అన్ని తొలగిపోయి మార్గం సుగమం అవుతుందని పురాణ పండితులు చెబుతారు. దుర్గ నవరాత్రులలో చివరి రోజు అమ్మవారు మహిషాసురమర్ధినిగా దర్శనం ఇస్తుంది.
౹౹అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోదినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతిహే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయాహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే౹౹
అనే మహిషాసురమర్ధిని స్తోత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ప్రతి మనిషిలో మంచి చెడు గుణాలనే అరిషడ్వర్గాలు అంటారు. ఆ అరిషడ్వర్గాలను నాశనం చేసి మనిషిని మనిషిగా నిలబెట్టి లోకాన్ని కాపాడటమే మహిషాసురమర్ధిని తత్వమని కూడా పురాణాలు చెబుతున్నాయి.
సమస్యల మవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకు శారీరక, మానసిక, భౌతిక సమస్యల నుంచి శక్తి స్వరూపిణి అమ్మవారు విముక్తి కల్పిస్తారు. మూడులోకాలను యేలే అమ్మను శరణు కోరితే ముక్తిని ప్రసాదించడంతో పాటు మనిషిలో నిద్రాణమై ఉన్న జ్ఞానాన్ని మేల్కొలుపుతుందని అమ్మవారి భక్తులలో నమ్మకం ఎక్కువగా ఉంటుంది.
ఇక ఈ నవమి రోజున ఆయుధపూజ చేయడం ఒక సంప్రదాయం. అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు??
ప్రతి మనిషి ఏదో ఒక వస్తువు ఉపయోగించి పని చేయడంతో కుటుంబాన్ని పోషిస్తాడు. పనికి ఉపయోగించే ఆయుధానికి పూజ చేస్తారు. ఆయుధం సమర్థవంతంగా ఉంటే ఆ పనిలో సగం విజయం సాదించినట్టే నమ్మకం కలుగుతుంది. ఈ ఆయుధ పూజ వెనుక ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి.
మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రయత్నం చేస్తారు. మహిషాసురుడికి మగవాడి వల్ల చావు లేదని తెలుసుకొని అమ్మవారిని మహిషాసురుడితో యుద్ధం చేయమని పంపుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ తమ శక్తిని అమ్మవారికి ధారపోస్తారు. ఆ శక్తిని నింపుకున్న అమ్మవారు మరింత శక్తివంతురాలుగా మారడంతో పాటు మిగిలిన దేవతలు తమతమ ఆయుధాలను అమ్మవారికి ఇవ్వడంతో వెయ్యి ఏనుగుల బలం చేకూరుతుంది.
ఎనిమిది చేతులలో ఆయుధాలను ధరించి, సింహవాహనంపై ఆసీనులై యుద్దానికి వెళ్తుంది. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఆ మహిషాసురుడితో అమ్మవారు భీకర యుద్ధం చేస్తుంది. తాను ధరించిన ఆయుధాలతో ఆ రాక్షసుడిని చంపేస్తుంది. ఇలా యుద్ధం ముగిసిన తరువాత ఉగ్రరూపంలో ఉన్న అన్నవారిని మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని సకల దేవలు అలపించి శాంతిప చేస్తారు. అమ్మవారి దగ్గర ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకుని వాటిని శుద్ధి చేసి, యుద్ధంలో విజయం చేకూర్చినందుకు కృతజ్ఞతగా ఆయుధాలకు పూజ చేస్తారు. ఆయుధపూజ వెనుక ఉన్న కథనంగా పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి పురాణాలలో కూడా వివిధ సందర్భాలలో ప్రతి యుద్ధానికి ముందు దుర్గాదేవి పూజ, ఆయుధపూజ జరపడం సంప్రదాయంగా వస్తోంది. నవమి రోజు అమ్మవారిని ఎరుపురంగు పూలతో పూజించి, గారెలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.