మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో బహుళ అంతస్తుల భవనం
కూల్చివేత కోర్టు ఆదేశాల మేరకు చర్యలు అక్కడ అన్నీ అక్రమ
నిర్మాణాలే అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు: రంగనాథ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: శేరిలింగంపల్లి జోన్ పరిధి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అం తస్థలు భవనాన్ని హైడ్రా ఆదివారం కూల్చివేసింది. ఆదివారం రోజు భారీ బుల్డోజర్లతో అక్కడకు చేరకున్న హైడ్రా బృందాలు ప్రత్యేక ప్లాన్ తో ఆ భవనాన్ని నేలమట్టం చేశాయి. జీహెచ్‌ఎంసి నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 684 చ.గ.లలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 పై అంతస్థుల భవనాన్ని ని ర్మించడంపై స్థానికుల ఫిర్యాదుమేరకు హైడ్రా చర్యలు తీసుకుందని కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. ముందుగా ఆ భవనానికి ఉన్న చట్టబద్దత, అనుమతులు, నియమనిబంధనలను పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణమని నిర్ధారించుకున్నాకనే కూల్చివేతలు చేపట్టినట్టు రంగనాథ్ తెలిపారు. హైడ్రా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసి, అధికారులతో కలిసి అయ్యప్ప సొసైటీలోని 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని గత శనివారం హైడ్రా అధికారుల బృందం నేరుగా ఇక్కడకు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు రంగనాథ్ పేర్కొన్నారు.
100 అడుగుల రోడ్డుకు ఏలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండా, తగిన పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా.. సెల్లార్‌లోనే కిచెన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయడంతో హైద్రా కూల్చివేతలను చేపట్టినట్టు కమిషనర్ వివరించారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు జారీచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందిస్తుందని కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు.
అయ్యప్ప సొసైటీలో చాలా వరకు అక్రమ నిర్మాణాలున్నాయనీ, వాటిపై జీహెచ్‌ఎంసి కమిషనర్‌తో రివ్యూ చేస్తామని, కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా కూల్చివేసిన అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్‌లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే బిల్డింగ్ కూల్చేశామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ బిల్డింగ్‌ను గతంలో జీహెచ్‌ఎంసీ పాక్షికంగా కూల్చేసిందని చెప్పారు.
ఫిర్యాదుతో..
అయ్యప్ప సొసైటీకి 71 ఎకరాల భూమి ఉందనేది స్థానికులు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి 1951లో గురకుల్ ట్రస్టుకు సంఘసేవకుడైన బద్రినాథ్ భారీగా భూమిని దానం చేశారనీ, గురకుల్ ట్రస్టు పేద పిల్లలకు విద్యను అందించడం, గోవులను సాదడం, నిరుపేదలకు భోజన వసతిని కల్పించడం చేసేదని. ఆ ట్రస్టు నిర్వహణకు ఆదాయం కోసం చౌకగా గురుకుల్ ట్రస్టు భూములను విక్రయించారనీ, ఈ క్రమంలోనే అయ్యప్ప సొసైటీ 71 ఎకరాల భూమిని కనీస ధరతో కొనుగోలు చేసినట్టు స్థానికులు తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఈ భూమికి యుఎల్‌సి కూడా క్లీయర్ చేసిందని, 1987 తర్వాత అయ్యప్ప సొసైటీ భూముల్లో అక్రమ నిర్మాణాలు వచ్చాయని స్థానికులు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం కూడా అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు, ఈ క్రమంలోనే శిల్పారామం పర్వత్‌నగర్ వెళ్ళే 100 అడుగుల రోడ్డు వెంటనే వెంకటేశ్వర్ రావుకు 22 ఎకరాల భూమి ఉందనీ తెలిపారు. అయితే, ఇతడి భూమిని ఆనుకుని 308 ప్లాట్ రాజారాంకు 684 చ.గ.లు స్థలముందనీ, వెంకటేశ్వర్ రావు భూమిలోకి చొచ్చుకుని వచ్చిన రాజారాం 100 అడుగుల రోడ్డలో 6 అంతస్థలు భవనం అనుమతులు లేకుండా నిర్మించాడనీ, దీనిపై మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోవడంతో.. ఆయన హైకోర్టుకు వెళ్ళి ఆదేశాలు పొందినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఆ ఆర్డర్‌తో హైడ్రా అధికారులను సంప్రదిస్తే పరిశీలించి కూల్చివేసినట్టు స్థానికులు వివరిస్తున్నారు.