తప్పించుకునే క్రమంలో అయ్యప్ప స్వామిని కారుతో ఢీకొట్టిన నరేష్
పారిపోతున్న క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ
కారును వదిలి పారిపోయిన బైరి నరేష్
మనతెలంగాణ/మంగపేట: నాస్తికవాది బైరి నరేష్, అయ్యప్ప స్వాముల మధ్య గొడవ జరగింది, దీంతో వారి నుంచి తప్పించుకొని క్రమంలో నరేష్ కారు అయ్యప్ప స్వాములను ఢీకొట్ట అనంతరం తన కారు బోల్తాపడిన సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హేతువాది, నాస్తికుడు బైరి నరేష్‌ను సోమవారం ఏటూరునాగారం ఆయ్యప్ప భక్తులు అడ్డుకుని బైరి నరేష్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఏటూరు నాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న భీంరావు కోరేగావ్ సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు గతంలో అయ్యప్ప భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తు బైరి రమేష్‌ను ముట్టడించారు.
అయ్యప్పలను దూషించిన నువ్వు ఏటూరునాగారంలో సభను ఎలా నిర్వహిస్తావని ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి నుంచి బైరి నరేష్ వెళ్ళిపోతున్న క్రమంలో కారు ఎక్కి కారును ముందుకు నడుపగా కారు క్రింద పోగు నర్సింహారావు అనే అయ్యప్ప స్వామి కాలు పడి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన అయ్యప్ప స్వాములు తనపై దాడి చేస్తారనే భయంతో ఏటూరు నాగారం మండల కేంద్రం నుండి మంగపేట మండలం కమలాపురం మీదుగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన వాహనాన్ని స్పీడ్‌గా నడుపుతున్న క్రమంలో ఏటూరునాగారం, కమలాపురం మధ్యంలో జీడివాగు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో మరింత భయానికి లోనైన బైరి నరేష్ కారును అక్కడే వదిలి పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బైరి నరేష్, ఆయన కారు డ్రైవర్‌పై ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.