జైరాం రమేశ్ సెటైర్లు
కష్టకాలంలో పార్టీని వీడడం దురదృష్టకరమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడడం దురదృష్టకరం, బాధాకరమని కాంగ్రెస్ పేర్కొంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఆయన పార్టీకి రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో నిజం లేదని జైరాం రమేశ్ అన్నారు. అనంతరం జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు. గులాం నబీ ఆజాద్ డిఎన్‌ఎ ‘మోడిపై అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందన్నారు. ఆయన మాత్రం కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేశారన్నారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు. పార్టీ మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్ ఖేరా సైతం గులాం నబీఆజాద్‌ను తప్పుబట్టారు. గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగియడమే ఆయన రాజీనామాకు కారణమని అన్నారు.
తన రాజీనామా లేఖలో ఒకటిన్నర పేజీలు తాను నిర్వహించిన పదవుల కోసం కేటాయించిన ఆజాద్ తన రాజ్యసభ సభ్యత్వం ముగియగానే రెస్ట్‌లెస్‌గా మారారని, పదవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరని రుజువు చేసుకున్నారని ఖేరా విమర్శించారు. పార్టీని ఎవరు బలహీనం చేశారనిఖేరా ఎదురు ప్రశ్నిస్తూ నిజానికి పార్టీని బలహీనపరిచారని ఆరోపిస్తున్న వీళ్లే పార్టీ బలహీనం కావడానికి కారణమని తీవ్రంగా ధ్వజమెత్తారు. జమ్ము, కాశ్మీర్ కాంగ్రెస్ విభాగం పునర్యవస్థీకరణలో తనను సంప్రదించలేదంటూ ఆజాద్ చేసిన ఆరోపణలను కూడా కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ విషయంలో జరిగిన పార్టీ సమావేశాలు నాలుగింటిలోను ఆజాద్ పాల్గొన్నారని, చివరగా జులై 14న సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారని ఆ వర్గాలు తెలిపాయి. జమ్మూ, కశ్మీర్ పార్టీ విభాగం అధ్యక్ష పదవికి ఆజాద్ నాలుగు పేర్లను సూచించారని, వారిలో ఒకరిని పార్టీ ఎంపిక చేసినప్పటికీ ఆయన అసంతృప్తిగా ఉన్నారని పార్టీ నాయకుడొకరు చెప్పారు.
గౌరవం ఉండదు: ఫరూక్ అబ్దుల్లా
మరోవైపు ఆజాద్‌కు ఇకపై గౌరవం దక్కక పోవచ్చని జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై తాము గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలోను ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమన్నారు.