రాంపూర్(యుపి): నకిలీ జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ కేసులో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్, ఆయన భార్య తజీన్ శాతీమా, వారి కుమారుడు అబ్దులా ఆజంకు ఏడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన వెంటనే దోషులు ముగ్గురినీ జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని కోర్టు నుంచి నేరుగా జైలుకు పంపుతారని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా తెలిపారు. ముగ్గురు దోషులకు ఎంపి, ఎమ్మెల్యే కోర్టు మెజిస్ట్రేట్ శోభిత్ బన్సల్ గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.
బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా 2019 జనవరి 3న రాంపూర్‌లోని గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. లక్నో నుంచి ఒకటి, రాంపూర్ నుంచి ఒకటి చొప్పున రెండు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందేందుకు తమ కుమారుడికి ఆజం ఖాన్, ఆయన భార్య సహాయపడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రాంపూర్ మున్సిపాలిటీ నుంచి పొందిన బర్త్ సర్టిఫికెట్‌లో అబ్దుల్లా ఆజం పుట్టిన తేదీ 1993 జనవరి 1 అని ఉండగా లక్నో నుంచి పొందిన సర్టిఫికెట్‌లో 1990 సెప్టెంబర్ 30 అని ఉంది.
కాగా..2019లో చేసిన విద్వేష ప్రసంగానికి సంబంధించి కోర్టు జైలు శిక్ష విధించడంతో సమాజ్‌వవాది పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆజం ఖాన్ 2022 అక్టోబర్‌లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది..