యుపిఎస్‌సి తరహాలో ఉద్యోగాల క్యాలెండర్
సాధ్యాసాధ్యాలు పరిశీలించి అమలుకు కృషి
జాప్యం లేకుండా నియామకాల పూర్తి చేసేలా చర్యలు
టిఎస్‌పిఎస్‌సి నూతన ఛైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరింబోతున్న సందర్భంగా ‘మన తెలంగాణ’తో తన అభిప్రాయాలు పంచుకున్న బి.జనార్ధన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యుపిఎస్‌సి తరహాలో ఉద్యోగాల క్యాలెండర్ చాలా అవసరమని టిఎస్‌పిఎస్‌సికి నూతన ఛైర్మన్‌గా నియామకమైన బి.జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఆ దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా బి.జనార్ధన్‌రెడ్డి ‘మన తెలంగాణ’ ప్రతినిధితో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడారు. ఉద్యోగాల క్యాలెండర్‌కు సంబంధించిన యుపిఎస్‌సితో పాటు వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో ఉత్తమ విధానం అమలు చేసేందుకు ప్రయత్నంచేస్తామని అన్నారు. ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సాధ్యమైనంతవరకు ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. న్యాయ నిపుణులు, సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో జాప్యం, సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేసి, లోపరహిత వ్యవస్థను తీర్చిదిదుతానని స్పష్టం చేశారు.
ప్రజాసేవ చేయాలన్న దృక్పథం ఉండాలి
ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలనుకునే వారికి ప్రతిభ, ప్రజా సేవ చేయాలన్న దృక్పథం కచ్చితంగా ఉండాలని జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉండాలని అన్నారు. ఇలాంటి అభ్యర్థులకు ఎంపిక చేసేందుకు ఉత్తమ విధానం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పారదర్శక విధానాలు అమలు చేస్తూ త్వరితగిన నియామకాలు పూర్తి చేసేలా కృషి చేస్తామని అన్నారు.
B Janardhan reddy appointed as TSPSC Chairman