మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులను విరివిగా విడుదల చేయడం ఏమిటీ..? అని ప్రధానిని ఆయన ప్రశ్నించారు.
గుజరాత్ రాష్ట్రానికి తొమ్మిది నెలల వ్యవధిలో రూ. ఒక లక్షా 37 వేల 655 కోట్ల ( రూ. 1,37,655 కోట్లు ) విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పనులకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేశారని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిధుల వరదను ప్రధానిని పారించారని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్రమోడీ దాదాపు 40 సార్లు ఆ రాష్ట్రంలో పర్యటించి.. నిధులను మంజూరు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ఆయన తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులను మంజూరు చేసే విషయంలో ప్రధాని వివక్షతను చూపుతున్నారని వినోద్‌కుమార్ అన్నారు.