Monday, December 23, 2024

మరో కొత్త కరోనా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన

- Advertisement -
- Advertisement -

BA.4.6 variant spreading from America to Britain

అమెరికా నుంచి బ్రిటన్‌కు వ్యాపిస్తున్న బిఎ.4.6 వేరియంట్

లండన్ : కరోనా మహమ్మారిని నివారించడానికి అనేక టీకాలు, మందులు అందుబాటు లోకి వస్తున్నా కొవిడ్ 19 తన రూపురేఖలను మార్చుకుంటూ మరింత ప్రమాదకారిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్‌కు చెందిన సబ్ వేరియంట్ బీఏ .4.6 అమెరికాలో వేగంగా వ్యాపిస్తుండగా, ఇప్పుడు బ్రిటన్‌లో కూడా వేగం పుంజుకుంటోంది. యుకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యుకెహెచ్‌ఎస్‌ఎ) గుర్తించిన సమాచారం ప్రకారం ఆగస్టు 14తో ప్రారంభమయ్యే వారంలో బ్రిటన్‌లో బిఎ .4.6 కేసులు 3.3 శాతం ఉండగా, ఇప్పటికి 9 శాతం వరకు కేసులు పెరిగాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం బిఎ.4.6 వేరియంట్ ఇప్పుడు అమెరికా అంతటా ఇటీవలి కేసుల్లో 9 శాతం పైగా ఉంది. ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ గురించి వైద్య నిపుణులు, పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒమిక్రాన్ బిఎ.4 వేరియంట్ రూపాంతరమే బిఎ.4.6 వేరియంట్. బీఎ 4 ను మొదటిసారి 2022 జనవరిలో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇది బీఏ 5 వేరియంట్‌తోపాటు ప్రపంచమంతటా వ్యాపించింది.

అయితే బిఎ 4.6 వేరియంట్ ఎలా ఆవిర్భవించిందో స్పష్టంగా తెలియలేదు. కానీ అది రీకాంబినెంట్ వేరియంట్ కావచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ 19 కి కారణమయ్యే సార్స్ కొవి2 కు చెందిన రెండు వేర్వేరు రకాలు ఒకే వ్యక్తికి ఒకే సమయంలో సోకినప్పుడు రీకాంబినెంట్ (పునసంయోగం) జరుగుతుందని, దీని కారణంగా ఈ వేరియంట్ ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అనేక విధాలుగా బిఎ.4 మాదిరిగానే బిఎ.4.6 వేరియంట్ ఉంటుంది. ఇది వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్‌కు మ్యుటేషన్‌ను కలిగిస్తుంది. ఈ ప్రొటీన్ మన కణాల్లోకి ప్రవేశించడానికి వైరస్‌కు అనుమతిస్తుంది. ఈ మ్యుటేషన్ ఆర్ 346 టి ఇతర రూపాంతరాల్లో కనిపించింది కూడా. రోగ నిరోధకతను తప్పించుకునే విధంగా వ్యవహరిస్తుంది. అంటే వ్యాక్సినేషన్ వల్ల, ముందస్తు సంక్రమణ వల్ల చేకూరిన యాంటీబాడీలను (ప్రతిరోధకాలను) తప్పించుకోడానికి వీలుగా వైరస్‌కు సహాయపడుతుంది. అయితే తీవ్రత, వ్యాధి వ్యాప్తి, రోగనిరోధకతను ప్రతిఘటించడంలో తక్కువ ప్రభావమే దీనికి ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి.

ఈ వేరియంట్ తీవ్రమైన లక్షణాలను సంక్రమింప చేస్తుందని చెప్పే నివేదికలు లేకున్నా జాగ్రత్తలు తీసుకోవడం కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదివరకటి వేరియంట్ల కంటే ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్కువ వ్యాప్తి కలిగినదని చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంలో బిఎ 5 కన్నా బిఎ 4.6 వేరియంట్ చాలా చురుకుగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వేరియంటే ఆధిపత్యం వహిస్తోంది. ఇంకా లోతుగా అధ్యయనం చేయని సమాచారమైనప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఇతర డేటా దీనికి మద్దతు ఇస్తుంది. అసలైన కొవిడ్ వ్యాక్సిన్ ‘ఫైజర్’ తాలూకు మూడు డోసులు పొందిన వ్యక్తులు బిఎ 4లేదా బిఎ 5 కంటే బిఎ.4.6వేరియంట్‌కు ప్రతిస్పందనగా తక్కువ యాంటీబాడీలను (ప్రతిరోధకాలను) ఉత్పత్తి చేస్తారని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వెల్లడించింది. బిఎ 4.6 వేరియంట్‌కు వ్యతిరేకంగా కొవిడ్ వ్యాక్సిన్లు తక్కువ ప్రభావం చూపిస్తాయని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త బైవాలెంట్ (ద్విపద) బూస్టర్ల ద్వారా ఈ బిఎ 4.6 వేరియంట్‌ను కొంతవరకు అదుపు చేయవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News