‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యూనివర్స్’ యానిమేటెడ్ సిరీస్‌ని హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ఈ యానిమేటెడ్ సిరీస్ మాహిష్మతి అద్భుత రాజ్యాన్ని, సింహాసనాన్ని పెను ముప్పు నుండి రక్షించడానికి బాహుబలి, భల్లాలదేవ చేతులు కలిపిన సామ్రాజ్యాల ఘర్షణ యొక్క లెజెండరీ ప్రయాణంలో తిరిగి తీసుకువెళుతుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియా వర్క్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఎస్ రాజమౌళి, శరద్ దేవరాజన్, శోబు యార్లగడ్డ దీనిని నిర్మించారు. జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్ ఈనెల 17న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ ఈవెంట్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ “బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ’బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది. మేము బాహుబలి యునివర్స్ ని విస్తరించడమే కాకుండా, దాని అద్భుతమైన యానిమేషన్, ఎమోషన్స్, సంక్లిష్టమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కథను రూపొందించాము”అని అన్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ కో -క్రియేటర్, రచయిత, మేకర్ శరద్ దేవరాజన్ మాట్లాడుతూ “బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’కి జీవం పోయడం గ్రాఫిక్ ఇండియాలో మనందరికీ సంతోషకరమైన ప్రయాణం.
మేము మొదట ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు, బాహుబలి ఫ్రాంచైజీ వారసత్వానికి అనుగుణంగా యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించడం – మేము ఒక గొప్ప బాధ్యతను తీసుకుంటున్నామని మాకు తెలుసు. విజనరీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్నీ+ హాట్‌స్టార్,హెచ్‌ఎస్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ హెడ్ -కంటెంట్ గౌరవ్ బెనర్జీ, బాహుబలి వాయిస్‌కు తన గాత్రాన్ని అందించిన నటుడు శరద్ కేల్కర్ పాల్గొన్నారు.