న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ రూ. 1.50 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ దిఫెండర్ 130 కారులో ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో డ్రైవింగ్ సీటులో కూర్చుని షికారు చేశారు. ఆటోబొబైలియార్డెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. పాంకోళ్లు వేసుకున్న బాబా రాందేవ్ ఈ బ్రాండ్ న్యూ భారీ ఎస్‌యువిని డ్రైవ్ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.
సెడోనా రెడ్ కలర్‌లో ఉన్న ఈ ఎస్‌యువి స్పోర్ట్ ధర రూ. 1.5 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ బ్రాండ్ న్యూ కారును బాబా రాందేవ్ డ్రైవ్ చేసినప్పటికీ ఆయన కొన్నారా ఈలేక టెస్ట్ డ్రైవ్ చేశారా అన్నది తెలియరాలేదు. ఇండియన్ మార్కెట్‌లో ల్యాండ్ రోవర్‌కు చెందిన మోస్ట్ ప్రీమియం మోడల్ ఎస్‌యువిగా ఇది పేరు పొందింది. కారులో మరి కొందరు వ్యక్తులు కూడా కూర్చుని ఉన్నారు. జిరిస్ట్రేషన్ ప్లేట్లు లేకపోవడంతో ఇది బ్రాండ్ న్యూ కారని తెలుస్తోంది. యుపిఎ హయాంలో పెట్రోల్ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో నిరసనలు, వ్యాఖ్యలు చేసిన వ్యక్తులలో బాబా రాందేవ్ ఒకరు.
అప్పట్లో ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారేకు మద్దతుగా కూడా నిలబడ్డారు. అయితే ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబా రాందేవ్ తన రాజకీయ వ్యాఖ్యలకు విరామం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎంత పెరిగినా పెదవి విప్పని బాబా రాందేవ్ లగ్జరీ కారులో షికారు చేయడం విమర్శలకు తావిస్తోంది. యోగా గురు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా రాందేవ్ ఏటా రూ. 46,000 కోట్ల వ్యాపారం చేసే మల్టీనేషనల్ కంపెనీ పతంజలికి సహ వ్యవసథాపకుడే కాక బ్రాండ్ అంబాసడర్ కూడా.