Friday, December 20, 2024

మురికి వాడ ప్రాజెక్టే బాబా సిద్ధిఖీ హత్యకు కారణమా ?

- Advertisement -
- Advertisement -

ముంబై : బాంద్రా మాజీ ఎమ్‌ఎల్‌ఎ, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. శనివారం రాత్రి ఆయన తన కుమారుడి కార్యాలయం ముందు టపాసులు కాలుస్తున్న సమయంలో హర్యానాకు చెందిన గుర్మయిల్ బల్జిత్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ అనే యువకులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీ కన్నుమూశారు.
వ్యాపార విభేదాల కారణంగా…బాబా సిద్ధిఖీకి ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో వ్యాపార విభేదాలున్నట్టు పోలీస్‌లు గుర్తించారు. దీనిలో అవకతవకల కారణం గానే ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. హంతకులు చాలా ముందుగానే ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టు తేలింది. నిందితులకు ముందే చెల్లింపులు జరిపినట్టు సమాచారం. మరోవైపు ఆయుధాలు పార్మిల్‌లో వచ్చినట్టు తెలుస్తోంది. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీస్‌లు చెబుతున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ముంబై వస్తోంది.
స్లమ్ డెవలప్‌మెంట్ స్కాం..
2018లో ఈడీ బాబా సిద్ధిఖీకి చెందిన రూ. 462 కోట్ల ఆస్తిని అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆయన 20002004 వరకు మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. అప్పుడు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు చేపట్టారు. దీనిలో రూ. 2000 కోట్ల స్కాం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 2012 లో దీనిపై అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2014లో సిద్ధిఖీసహా 150 మందిపై కేసు నమోదైంది. ఇళ్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
రాజకీయాల్లో శరవేగంగా ఎదిగి..
జియా ఉద్దీనన్‌సిద్ధిఖీ అలియాస్ బాబా సిద్ధిఖీ 1977లో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరారు. చాలా వేగంగా వివిధ పదవులు చేపట్టి, 1980 నాటికి బాంద్రా తాలూకాలో కీలక నేతగా మారారు. ఆయన మాజీ కాంగ్రెస్ నేత, నటుడు సునీల్ దత్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు. తొలిసారి బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్‌ఎల్‌ఎగా గెలుపొందారు. ఆ తరువాత మూడు సార్లు తన పీఠం నిలబెట్టుకున్నారు. మహారాష్ట్ర కార్మిక, ఫుడ్ సివిల్ సప్లయిస్ , లేబర్, ఎఫ్‌డీఎ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. అదే సమయంలో బాలీవుడ్‌లో కూడా బలమైన సంబంధాలు నెరిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత హఠాత్తుగా అజిత్‌పవార్ నేతృత్వం లోని ఎన్సీపీలో చేరారు.
భారీ ఇఫ్తార్ విందులకు మారుపేరు…
బాబా సిద్ధిఖీ పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చే ఇఫ్తార్ విందులు బాలీవుడ్‌లో బాగా పాప్యులర్ . వీటికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సహా ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి ఓ విందులోనే సిద్ధిఖీ మధ్యవర్తిత్వం తోనే సల్మాన్ షారుక్ మధ్య కోల్డువార్‌కు ముగింపు పలికినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News