కరాచి : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు స్టార్ ఆటగాడు, మాజీ సారధి బాబర్ అజమ్‌ను జట్టు నుంచి తప్పిస్తూ తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి చెందిన పాక్ జట్టు భారీ ప్రక్షాళనను చేపట్టింది. అందులో భాగంగా రెండు, మూడు టెస్టులకు స్టార్ క్రికెటర్ బబార్‌పై వేటు వేస్తూ జట్టును ఆదివారం ప్రకటించింది. బాబర్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లకు పాక్ సెలక్షన్ కమిటీ ఉద్వాసన తెలిపింది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గుహ్లామ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సజీద్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది. షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ఎంపిక చేసింది. అయితే బాబర్‌ను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాలను పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో సభ్యుడు ఆకీబ్ జావేద్ మీడియాకు తెలియజేశాడు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశామని వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం దొరకడంతో ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత తిరిగి పొందడానికి సాయపడుతుందని, భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, రెండేళ్ల నుంచి బాబార్ టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. ఈ పార్మట్‌లో కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
పాకిస్థాన్ జట్టు ఇదే..
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్ కీపర్), అమీర్ జమాల్, కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నోమన్ అలీ, సయిమ్ అయుబ్, సాజిద్ ఖాన్, జాహిద్ మెహమూద్, సల్మాన్ అలీ అఘా.