ఐసిసి టి20 ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, శ్రీలంక బౌలర్ వనిండు హసరంగా టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. యుఎఇ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. బాబర్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బాబర్ 834 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలాన్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. మలాన్ 798 పాయింట్లతో ఈ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లాడు. వరల్డ్‌కప్‌లో నిలకడగా రాణించడం ద్వారా ఫించ్ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. ఇక పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పొట్టి ప్రపంచకప్‌లో రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరుస్తున్న విషయం తెలిసిందే.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో ర్యోక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐడెన్ మార్‌క్రమ్ (ఇంగ్లండ్) ఆరో డెవోన్ కాన్వే (కివీస్) ఏడో, కెఎల్.రాహుల్ (భారత్) 8వ ర్యాంక్‌లో నిలిచారు. జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ఎవిన్ లూయిస్ (విండీస్)లు కూడా టాప్10 ర్యాంకుల్లో చోటు సంపాదించారు. ఇక బౌలింగ్ విభాగంలో లంక స్పిన్నర్ వనిండు హసరంగా కెరీర్‌లో తొలి సారి ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో హసరంగా 776 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న తబ్రేస్ షంసి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు.
ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) మూడో, రషీద్ ఖాన్ (అఫ్గాన్) నాలుగో, ముజీబ్ ఉర్ రహ్మాన్ (అఫ్గాన్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్‌ల విభాగంలో మహ్మద్ నబి (అఫ్గాన్) టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) రెండో, స్మిత్ (నమీబియా) మూడో, వనిండు హసరంగా (శ్రీలంక) నాలుగో, జిషాన్ మక్సూద్ (ఒమన్) ఐదో ర్యాంక్‌లను దక్కించుకున్నారు. కాగా, తాజా ర్యాంకింగ్స్‌లో షకిబ్ టాప్ ర్యాంక్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అతన్ని వెనక్కి నెట్టి నబి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. పాకిస్థాన్ రెండో, టీమిండియా మూడో ర్యాంక్‌లో నిలిచాయి.